అంకుశంపూర్ మాజీ ప్రధానోపాధ్యాయుడు మృతి..
విద్యారంగానికి తీరని లోటు
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం అంకుశంపూర్ గ్రామానికి చెందిన మాజీ ప్రధానోపాధ్యాయుడు వంచ చంద్రారెడ్డి,అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణ వార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు, సహచర ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా తన సేవాకాలంలో విద్యార్థుల విద్యాభివృద్ధితో పాటు క్రీడల అభివృద్ధికి కూడా విశేష కృషి చేశారు. పాఠశాల విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు నిరంతరం కృషి చేసి ఎందరో విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు.
తన సుదీర్ఘ ఉపాధ్యాయ జీవితంలో వేలాది మంది విద్యార్థులకు విద్యాబోధన చేసి, సమాజానికి ఉత్తమ పౌరులను అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు, పూర్వ విద్యార్థులు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వంచ చంద్రారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.గురువు దేహంగా దూరమైనా.. ఆయన బోధనలు, విలువలు, సేవలు శాశ్వతంగా విద్యార్థుల హృదయాల్లో నిలిచిపోతాయిఅని పలువురు నివాళులర్పించారు.






