21 June, 2026 | 1:59 PM

టీజీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో అగ్నిప్రమాదం.. 41 మంది ప్రయాణికులు సురక్షితం

21-06-2026 12:45 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగిన ఘటన కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ సమీపంలో ఆలుగునూరు శివార్లలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుకు అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. పరిస్థితిని గమనించిన డ్రైవర్, కండక్టర్ వెంటనే బస్సును ఆపి, ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. డ్రైవర్, స్థానికులు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, మంటలను ఆర్పివేసేలోపే బస్సు పూర్తిగా కాలిపోయింది. 

ప్రమాద సమయంలో బస్సులో సుమారుగా 41 మంది ఉన్నారని, ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు. ఈ ఘటన కారణంగా కరీంనగర్-హైదరాబాద్ జాతీయ రహదారిపై తాత్కాలికంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అగ్నిమాపక శాఖ అధికారుల ప్రకారం, షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు గల కచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.