21 June, 2026 | 1:43 PM

రేపు కందనూలులో మంత్రి సీతక్క పర్యటన

21-06-2026 01:02 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) ఈ నెల 22న సోమవారం నాగర్‌ కర్నూల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నట్లు నాగర్‌ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు. ఉదయం తాడూరు మండలం సిర్సవాడ గ్రామంలో దుండుభి వాగుపై రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న హై లెవల్ బ్రిడ్జి పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ వంతెన నిర్మాణంతో సిర్సవాడతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు అన్ని కాలాల్లో సురక్షిత రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది.

అనంతరం నాగర్‌ కర్నూల్ పట్టణంలో రూ.5 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణ ప్రణాళికలను పరిశీలించనున్నారు. మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధి అవకాశాల పెంపునకు ఈ భవన్ ఉపయోగపడనుందని ఎమ్మెల్యే తెలిపారు. మహిళలు, చిన్నారులకు భద్రత, న్యాయ సహాయం, మానసిక పరామర్శ, పునరావాస సేవలను ఒకే వేదికపై అందించేందుకు ఏర్పాటు చేయనున్న భరోసా సెంటర్ నిర్మాణ పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి పర్యటన విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పిలుపునిచ్చారు.