నూతన టెండర్ల లబ్దిదారులు అమ్మవారి సేవలో పాత్రులు కావాలి: డాక్టర్ కోట నీలిమ
సనత్‌నగర్,(విజయక్రాంతి): బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో నూతన టెండర్లు పొందిన లబ్దిదారులు అమ్మవారి సేవలో పాత్రులు కావాలని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ తెలిపారు. మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవార్లను దర్శంచుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు ఘనస్వాగతం పలికారు.
అనంతరం ఆలయ పరిసరాలు కలియతిరిగి భక్తులతో, ఆలయ సిబ్బందితో మాట్లాడి వారికున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు వేసవి తాపం రీత్యా తాగు నీరు అందించారు. ఈ క్రమంలో తన దృష్టికి వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బోనాల కాంప్లెక్స్ లో నూతనంగా టెండర్ పొందిన ఆయా షాపులను సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా టెండర్ దక్కించుకున్న లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
అమ్మవారి సేవలో పాత్రులు కావాలని కోరారు. అనంతరం బీకే గూడ GHMC కార్యాలయంలోని SIR హెల్ప్ డెస్క్ వద్ద నిర్వహించిన ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీ సుజాత, సిబ్బందితో SIR అమలు విధానం, ఓటర్ల సందేహాల నివృత్తిపై చర్చించారు. ఓటర్లు తమ వివరాలను ఓటరు జాబితాలో సరిచూసుకుని, ఎలాంటి తప్పులు ఉన్నా వెంటనే సవరించుకోవాలని కోరారు. అలాగే జాబితాలో పేరు లేని వారు సంబంధిత అధికారులను సంప్రదించి అవసరమైన పత్రాలతో నమోదు చేసుకోవాలని తెలియజేశారు.
SIR పట్ల ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలని, అర్హులందరి పేర్లను ఓటర్‌ల జాబితాలో చేర్చాలని అధికారులను కోరారు. ఓటర్ల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలన్నారు. జాబితాలో ఖచ్చితత్వం ఉండాలని, పేర్లలో లోపాలను సవరించడంలో ఓటర్‌లు ఇబ్బందులు ఎదుర్కొకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితిలో అర్హులైన వారి పేర్లు గల్లంతు కాకుండా అన్ని జాగ్రత్తగా ఉండాలన్నారు. మరోవైపు ఓటర్లు తమ వివరాలను ఓటరు జాబితాలో సరిచూసుకుని, ఎలాంటి తప్పులు ఉన్నా వెంటనే సవరించుకోవాలని సూచించారు. అలాగే జాబితాలో పేరు లేని వారు సంబంధిత అధికారులను సంప్రదించి అవసరమైన పత్రాలతో నమోదు చేసుకోవాలని తెలియజేశారు.






