గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యం
ఉట్నూర్,(విజయక్రాంతి): గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి మంద మకరందు అన్నారు. మంగళవారం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ- ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి ఛాంబర్‌లో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ శాఖ అధికారులు, మిషన్ భగీరథ అధికారులతో గిరిజన గ్రామాలలో త్రాగునీటి సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలలో త్రాగునీటి సరఫరా పరిస్థితులను విపులంగా పరిశీలించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. గిరిజన గ్రామాలలో ఎక్కడైనా త్రాగునీటి కొరత లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామానికి నిరంతర సరఫరా ఉండేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. మిషన్ భగీరథ పథకం క్రింద జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని, పైప్‌లైన్ లీకేజీలు, మోటార్ లోపాలు ఉంటే వెంటనే సరిచేయాలని తెలిపారు.
గిరిజన గ్రామాల అభివృద్ధికి సంబంధించి చర్యలు తీసుకోవాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, గ్రామీణ రహదారుల అభివృద్ధి, విద్యుత్ సరఫరా మెరుగుదల, అంగన్వాడీ భవనాల నిర్మాణం, ఆశ్రమ పాఠశాలల మరమ్మత్తుల పనులపై అధికారులు పర్యవేక్షిస్తూ పనులను నాణ్యతతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని తెలిపారు. ప్రతి శాఖ సమన్వయంతో పనిచేస్తే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, ఇంజనీర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






