13న కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీ
శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, రెండు రాష్ట్రాల అవసరాలపై చర్చ
హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఈనెల 13న త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి సతీశ్‌కుమార్ కంబోజ్ శుక్రవా రం నోటీసు జారీచేశారు. సమావేశంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా ల నీటి అవసరాలు, నీటి వినియోగం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు.
ఈ సమావేశానికి తెలంగాణ ఇరిగేషన్ అండ్ క్యాడ్ శాఖ ఇంజినీర్ ఇన్ -చీఫ్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఇంజినీర్ -ఇన్ -చీఫ్ హాజరుకావాలని సూచించారు. అలాగే 2025--26, 2026-27 నీటి సంవత్సరాల వాటర్ అకౌంట్ వివరాలను సిద్ధంచేసి సమర్పించాలని బోర్డు అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యత, రెండు రాష్ట్రాల సాగు, తాగునీటి అవసరాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకున్నది. సమావేశంలో తీసుకునే నిర్ణయాలు రెండు రాష్ట్రాల నీటి పంపిణీపై ప్రభావం చూపే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు.






