18-11-2025 08:53:07 AM
హైదరాబాద్: పత్తి కొనుగోళ్ల అంశంపై బీఆర్ఎస్ నేతలు(BRS leaders) మంగళవారం మార్కెట్లను సందర్శించనున్నారు.పత్తి కొనుగోళ్లు, రైతుల సమస్యలు సమస్యలు తెలుసుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ఈ పర్యటనకు వెళ్తున్నారు. నేడు ఆదిలాబాద్, భైంసా మార్కెట్(Bhainsa Market) యార్డులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) సందర్శించనున్నారు. ఎనుమాముల, కేసముద్రం మార్కెట్లను హరీశ్ రావు(Harish Rao) సందర్శించనున్నారు. ఆరుగాలం కష్టించి పత్తిని పండించిన తెలంగాణ రైతన్నలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల మార్కెట్ యార్డుల్లో పడిగాపులు కాస్తున్నారని కేటీఆర్ వెల్లడించారు.
కళ్ల ముందే పండించిన పత్తి ఈ చలికాలపు తేమకు పాడవుతోంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వాలేమో మొద్దు నిద్రపోతున్నాయని ద్వజమెత్తారు. నెల రోజుల్లో 28 లక్షల టన్నుల కొనుగోలు లక్ష్యం కాగా కేవలం 1.12 లక్షల టన్నుల పత్తి కొనుగోలు చేశారంటేనే రాష్ట్రంలో నెలకొన్న పత్తి కొనుగోళ్ళ సంక్షోభానికి అద్దం పడుతోందని కేటీఆర్ స్పష్టం చేశారు. తేమశాతం, కపాస్ మొబైల్ యాప్ రిజిస్ట్రేషన్, మిల్లుల గ్రేడింగ్ అంటూ కుంటి సాకులతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) పత్తి కొనుగోలు నిరాకరిస్తుంటే, దానికి జిన్నింగ్ మిల్లుల అవినీతి తోడై రైతన్న నడ్డి విరుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు మద్ధతు ధర దొరకక, మధ్య దళారులకు తెగనమ్ముకుని నష్టాల పాలవుతున్నారని చెప్పారు. రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ బీజేపీ, ఎంపీలు వెంటనే పత్తి కొనుగోలుకు కేంద్రంపైన ఒత్తిడి తీసుకురావాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.