21 May, 2026 | 11:55 AM

కేటీఆర్‌కు అప్పుడు సోయి లేదా!

23-08-2024 01:27 AM
  1. ఆ ఫామ్ హౌస్ అక్రమమా, సక్రమమా అనేది మున్సిపల్ మంత్రిగా పనిచేసినప్పుడు తెల్వదా? 
  2. ప్రభుత్వంలో విస్తృత పాత్ర పోషించాలని కోరారు 
  3. మీడియా చిట్‌చాట్‌లో ఎమ్మెల్సీ కోదండరాం

హైదరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): ‘కేటీఆర్‌కు అప్పుడు సోయిలేదా.. పదేళ్లు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసి మీరు.. నాడు అక్రమ కట్టడాలను ఎందుకు కూలగొట్టలేదు. మున్సిపల్ శాఖ మంత్రిగా చేసిన మీరు అక్రమంగా నిర్మించిన ఫామ్ హౌస్ లీజుకు తీసుకున్న అని చెప్పడం సిగ్గు చేటు. అది సరైందో కాదో అప్ప డు ఎందుకు తీసుకోలేదు. ఫామ్ హౌస్ ఎవరిదైనా తప్పు జరిగితే చర్యలు తీసుకోవాల్సిందే.’ అని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరామ్ అన్నారు.

గురువారం మీడియాతో ఆయన చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు అం శాలపై ఆయన మాట్లాడారు. పదేళ్లు తెలంగాణను విధ్వంసం చేసిన వాళ్లే నేడు నీతి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రహస్యంగా ఫోన్ ట్యాపింగ్‌లు, ప్రాజెక్టుల్లో అవినీతి, నిరుద్యోగ సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు.  

వారధిగా ఉంటా..

ఎమ్మెల్సీగా ఈ పాత్ర తనకు కొత్తగా ఉందన్నారు. మంత్రి పదవి మీద ఎటువంటి చర్చ జరగలేదన్నారు. కానీ విస్తృత మైన పాత్ర పోషించాలని ప్రభుత్వం తనను కోరిందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం లో ప్రజా సమస్యలు తెలపడానికి అవకాశమే ఉండేది కాదని, నిరసన కార్యక్రమా లు చేపడితే ముందస్తు అరెస్టులు, నిర్బంధాలతో అప్రజాస్వామికంగా వ్యవహరించేవారన్నారు. అటువంటి పరిస్థితుల్లో నిరంకుశ పాలనను ఓడించేం దుకు తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. రుణమాఫీ చేయడం సాహసోపేత నిర్ణయమని కోదండరాం అన్నారు.

రైతులు చాలా సంతోషంగా ఉన్నారని, రూ.2 లక్షల రుణం మాఫీ కావడంతో రైతులు బ్యాంకు ల నుంచి మళ్లీ కొత్తగా రుణాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. కానీ కొద్ది మంది రైతులకు రుణమాఫీ జరగలేదని, గత ప్రభుత్వంలో రేషన్ కార్డు పంపిణీలో జాప్యం వల్ల రుణమాఫీలో ఇబ్బంది కలిగిందన్నారు. 12 లక్షల రేషన్ కార్డు అప్లికే షన్లు 2016 నుంచి పెండింగ్‌లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రుణ మాఫీ కానీ రైతులు అధైర్యపడోద్దని, త్వరలో ఈ సమస్యకు పరిష్కారం దిశగా చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

అయితే కొన్ని పార్టీలు రాజకీయ స్వార్థం తో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి చిప్ప చేతిలో పెట్టిన ఆ నాయకులే నేడు రుణ మాఫీపై మాట్లాడటం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యావిధానంలో సీరియస్‌గానే ఉందన్నారు. సమీకరణాలతో వీసీల నియామకాలు జరగనున్నాయి. ఏ వర్సిటీకి ఎవరిని నియమించాలనేది ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఆయన తెలిపారు. 

సీఎం అమెరికా, దక్షిణకొరియా పర్యటన కారణంగా వీసీల నియామకాలు కాస్త జాప్యం జరిగిందని ఆయన వెల్లడించారు. రాజీవ్ గాంధీ దేశానికి ప్రధానిగా పనిచేశారన్నారు. ఆయన రాజీవ్ విగ్రహం మధ్య ఘర్షణ పెట్టొద్దన్నారు. 

నేను ప్రజల మనిషిని.. సెక్యూరిటీ అవసరంలేదు

తాను ప్రజల మనిషినని, వ్యక్తిగత భద్రతా సిబ్బంది తనకు అవసరంలేదని కోదండరాం స్పష్టం చేశారు. సెక్యూరిటీ వల్ల ప్రజలతో సత్సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని చెప్పారు. స్వేచ్ఛగా ప్రజలు తమ సమస్యలను తనకు తెలియజేసే అవకాశం ఉండదన్నారు. భద్రతా సిబ్బంది ఉంటే ప్రజలు తన వద్దకు రాకుండా నిలువరించే ప్రమాదం లేకపోలేదని ఆయన పేర్కొన్నారు.

ఎవరి వాటా వారు పొందాల్సిందే..

ఎస్సీ వర్గీకరణ హేతుబద్దంగా జరగాలని ఆయన పేర్కొన్నారు. ఎవరి వాటా వారు పొందడం ముఖ్యమన్నా రు. బీసీల  ప్రాతినిథ్యం తగ్గిందన్నారు. బీసీల ప్రాతినిథ్యాన్నా తాము కూడా కోరుకుంటున్నామన్నారు. ఇష్టమొచ్చినట్లు బీఆర్‌ఎస్ ప్రభుత్వం నాడు జిల్లా లను, జోన్లను ఏర్పాటు చేసి, 317 జీవో తో ఉద్యోగులకు స్థానికత లేకుండా చేసిందని మండిపడ్డారు. మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 317 జీవో, 46 జీవో, 55 జీవో విషయంలో సమస్యలున్నాయని, దీనిపై ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని పేర్కొన్నారు. అసలు పరీక్షలే నిర్వహించని వారు నిరుద్యోగుల సమస్యలపై ఇప్పుడు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.