24-11-2025 01:18:23 PM
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో(GHMC Corporators) తెలంగాణ భవన్‌లో కేటీఆర్(KTR) కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరైయ్యారు. రేపటి కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం, జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సన్నద్ధతపై కార్పొరేటర్లకు కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీయాలని కార్పొరేటర్లకు కేటీఆర్ సూచించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై నిలదీయాలని తెలిపారు. పారిశ్రామిక భూమల అమ్మకంపైనా నిలదీయాలని సూచించారు.
పది సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఎలాంటి అవినీతికి తావు లేకుండా అద్భుతంగా పదవీకాలం పూర్తి చేసుకోబోతున్నారని పార్టీ తరఫున వారికి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ముఖ్యంగా రెండవ సారి జీహెచ్ఎంసీలో(Greater Hyderabad Municipal Corporation) గెలిచిన తర్వాత కరోనా వంటి తీవ్ర సంక్షోభంలోనూ అద్భుతమైన సేవలను అందించిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో ప్రజలు పార్టీకి ప్రతిపక్షంగా బాధ్యత ఇచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఉన్న కార్పొరేటర్లు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పైన పోరాటం చేసిన తీరును గుర్తుచేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో(Jubilee Hills Constituency) కార్పొరేటర్లు బాధ్యతాయుతంగా ఎన్నికలను పోరాడిన తీరుపైన అభినందనలు తెలిపారు. పార్టీ వెంటే నిలబడిన ప్రతి ఒక్క కార్పొరేటర్‌కి భవిష్యత్తులో మరిన్ని పదవులు వస్తాయని హామీ ఇచ్చారు. కార్పొరేటర్లు భవిష్యత్తులో జరిగే ఎన్నికను తమ ఎన్నికగా తీసుకొని పార్టీ అందరినీ తిరిగి గెలిపించుకుంటుందని భరోసా కల్పించారు. కార్పొరేటర్లకి రానున్న కాలంలో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల నేపథ్యంలో మంచి భవిష్యత్తు ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు.