26 April, 2026 | 4:28 PM

తొలి అడుగులోనే కేటీఆర్ నైతిక విజయం

21-12-2024 01:08 AM
  1. ఆరెస్ట్ చేయొద్దనే హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు
  2. ఈ-రేస్ కేసులో బయటపడిన ప్రభుత్వ డొల్లతనం
  3. కంపెనీపై కేసు ఎందుకు పెట్టలేదు?
  4. కేటీఆర్‌పై ఎన్ని కేసులు పెట్టినా వెనకడుగు వేయం: ఎమ్మెల్యే హరీశ్‌రావు

హైదరాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని, ఇది కేటీఆర్ నైతిక విజయమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. కేటీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి అక్రమం గా కేసులు బనాయించారని ఆరోపించారు.

న్యాయస్థానం ఉత్తర్వులతో ప్రభుత్వ డొల్లతనం తేటతెల్లమైందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో సీఎం పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని, సీఎంది కచ్చితంగా గోబెల్స్ ప్రచారమేనన్నారు.

ఈ- రేసింగ్‌పై సభలో చర్చ పెట్టాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కోరినా, పట్టించుకోలేదని వాపోయారు. కేటీఆర్‌పై కేసు పెట్టొద్దని తాము అడగటం లేదని, అసెంబ్లీలో చర్చ పెట్టమని మాత్రమే అడిగామని స్పష్టం చేశారు. ఈ- రేసులో రూ.600 కోట్ల అవినీతి అంటూ సీఎం రేవంత్ అసత్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

ఆయన వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదన్నారు. వాస్తవానికి ప్రభుత్వానికి రూ.700 కోట్ల సొమ్ము వచ్చిందని స్పష్టం చేశారు. రూ.700 కోట్ల జీఎస్టీలో 10శాతం నేరుగా రాష్ట్ర ఖజానాకు చేరుతుందని, ఇంకో 10 శాతం కేంద్రం ఖజానాకు చేరుతుందన్నారు. అంటే రాష్ట్రానికి రూ.70 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఆ రూ.70 కోట్లలో 2.102 శాతం డెవల్యూషన్ కింద మరో రూ.కోటిన్నర రాష్ట్ర ఖజానాలోనే జమ అవుతాయన్నారు.

ఈ చొప్పున రూ. 71.50 కోట్లు ఖజానాకు దక్కేలా చేయడం తప్పా..? అని నిలదీశారు. కాంగ్రెస్ పాలనలోనే గతంలో ఢిల్లీలో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్‌లో పెద్ద కుంభకోణం జరిగిందని గుర్తుచేశారు. ప్రజలకు ఇచ్చిన హమీలను ఎలా నెరవేర్చాలో తెలియక కాంగ్రెస్ తిమ్మిని బమ్మిని చేయాలని చూస్తోందన్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే  దివాలాకోరు ప్రచారం మొదలు పెట్టారని మండిపడ్డారు.

కాంగ్రెస్ చేతికి అధికార మార్పిడి తప్ప, ప్రజల జీవితాల్లో ఏం మార్పు వచ్చిందని ప్రశ్నించారు. ప్రభుత్వంపై విమర్శలు చేసిన వారిపై కేసులు పెట్టడం తప్ప సీఎంకు ఏమీ తెలియదని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి సోదరులు, సీఎం అల్లుడు, బావమరిది బాగోతాలను కేటీఆర్ బయటపెడుతున్నందుకే కక్ష గడుతున్నారని ఆరోపించారు.

ఈ-రేసు కేసులో ఏ-1 కేటీఆర్, ఏ-2 మరో అధికారి కాగా, మరి అసలు కంపెనీపై ఎందుకు కేసు పెట్టలేదని నిలదీశారు.  సీఎం రేవంత్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో తెలంగాణ ప్రతిష్ఠ దిగజారే పరిస్థితి నెలకొన్నదని అభిప్రాయపడ్డారు. రైతులు, ఆటో డ్రైవర్లు, అంగన్‌వాడీలు, ఆశ కార్యకర్తలపై కేసులు బనాయించడమే సీఎంకు తెలుసునన్నారు.

చివరకు పోలీసులపైనా కేసులు పెట్టించారని మండిపడ్డారు. ఢిల్లీలో రాజ్యాంగ పరిరక్షణ కావాలని కాంగ్రెసోళ్లు నిరసన వ్యక్తం చేస్తుంటే, గల్లీలో మాత్రం రాజ్యాంగ భక్షణ చేస్తున్నారని వర్ణించారు. హైడ్రా దెబ్బకు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందన్నారు. కేటీఆర్‌పై ఎన్ని కేసులు పెట్టినా ప్రజా సమస్యలపై పోరాటం ఆపే ప్రసక్తిలేదన్నారు.

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై చోటే భాయ్ బడా భాయ్ బంధం బయట పడుతోందన్నారు. సివిల్ సప్లు విభాగంలో కుంభకోణం విషయమై మంత్రి పొంగులేటి ఇంట్లో జరిగిన ఈడీ దాడులను ఎందుకు బయటకు చెప్పడం లేదని ప్రశ్నించారు.