ఈ -రేస్‌లో అవినీతి జరగలేదు
- మంత్రి పొన్నం మాటల్లోనే ఆ విషయం తేలింది
- హెచ్‌ఎండీఏ సొంతంగా డబ్బులు ఖర్చు చేయవచ్చు
- నాపై పెట్టిన కేసును న్యాయపరంగా ఎదుర్కొంటా
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో చిట్ చాట్
హైదరాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాంతి): ఫార్ములా ఈ- రేస్‌లో అవినీతి జరగలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ మాటలతో తేలిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. హెచ్‌ఎండీఏ కార్పొరేషన్ చట్టంలో హైదరాబాద్ నగర ప్రగతికి పనికి వచ్చే ఎలాంటి కార్యక్రమానికైనా డబ్బులు ఖర్చు చేయవచ్చని తెలిపారు.
హెచ్‌ఎండీఏ చేసే ప్రతి పనికి ప్రభుత్వ అనుమతులు అవసరం లేదని చట్టంలో ఉందని ఆయన తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. ఫార్ములా ఈ-రేస్ కేసులో కొందరు ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. తనపై కేసు నిలవదని, లీగల్‌గా ముందుకు వెళ్లి కేసును ఎదుర్కొంటానని తెలిపారు.
లీజును ఎందుకు రద్దు చేయడం లేదు..
ఓఆర్‌ఆర్ లీజు అంశంలో సిట్ ఏర్పాటుపై స్పందిస్తూ టీఓటీ దేశంలో ఇప్పటికే అమలులో ఉందని, ఈ విధానంలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు నుంచి వచ్చిన డబ్బులను రైతు రుణమాఫీకి ఉపయోగించామని కేటీఆర్ తెలిపారు. ఆర్థిక వనరుల సమీకర ణపైనా అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ అనేక సూచనలు ఇచ్చిందన్నారు.
ఔటర్ రింగ్ రోడ్డు నుంచి డబ్బులు సేకరించవచ్చని సూచించిందని పేర్కొన్నారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ రహదారుల నుంచి డబ్బులు సేకరిస్తున్న టీవోటీ విధానంలోనే అవుటర్ రింగ్ రోడ్డు నుంచి డబ్బులను సేకరించామని తెలిపారు. ప్రయివేట్ కంపెనీకి లబ్ధి చేకూర్చినట్టు అరోపిస్తున్న సీఎం రేవంత్ ఆ కంపెనీతో లీజుని ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు.
గతంలో అవుటర్ రింగ్ రోడ్డు లీజుపైనా ఆయన మాట్లాడిన లక్ష కోట్ల అవినీతి అడ్డగోలు మాటలపై హెఎండీఏ పరువు నష్టం కేసు వేసిందని చెప్పారు. ఇప్పటికీ రేవంత్‌రెడ్డిపై హెచ్‌ఎంబాఏ వేసిన కేసు అలాగే ఉందన్నారు. ముఖ్యమంత్రి ఔటర్ రింగ్ రోడ్డు అనేది కుంభకోణమని విమర్శలు చేశారని, దాని లీజ్‌ను ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు.
నిజాలు ఎలా బయటకు వస్తాయి..
సీఎం రేవంత్‌రెడ్డి మున్సిపల్ శాఖ, హోంశాఖ మంత్రిగా ఉన్నారని, ఇలాంటి సందర్భంలో సిట్ ద్వారా తన పరిధిలో ఉన్న అధికారులతో వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి, తన సొంత శాఖ అధికారులతో దర్యాప్తు చేస్తే నిజాలు ఎలా బయటకు వస్తాయో రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు. అందుకే ఔటర్ రింగ్ రోడ్డు లీజును రద్దుచేసి సిట్టింగ్ జడ్జితో కానీ రిటైర్డ్ జడ్జితో కానీ నిష్పాక్షిక విచారణ జరిపించాలని కోరారు.
ఒకవేళ కుంభకోణం జరిగి ఉంటే ఆయాచితంగా లబ్ధి జరిగిన కంపెనీని కాంట్రాక్టు ఎందుకు రద్దు చేయడం లేదన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించకుంటే ఇది మరొక రాజకీయ కక్ష సాధింపు కేసు అని ప్రజలు అనుకుంటారని ఆయన పేర్కొన్నారు. న్యాయమూర్తిని ఏర్పాటు చేసే బృందం జాతీయ రహదారుల సంస్థ విధానాలను అధ్యయనం చేయాలని కూడా తాము సూచిస్తామని ఆయన చెప్పారు.
తనపై ఆరోపణలు చేసి కక్ష సాధింపుల కోసం మాత్రమే పరిమితం కాకుండా వాస్తవాలు తెలిసేలా మాట్లాడాలని హితవు పలికారు. రూ. 10 వేల కోట్ల కోకాపేట కుంభకోణం అంటున్న భూముల అమ్మకాన్ని కూడా రాష్ర్ట ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సభ్యులకు శిక్షణ ఇచ్చి స్పీకర్.. ప్రతిపక్ష సభ్యులపైకి వాటర్ బాటిళ్లు, పేపర్లు విసరడం ఏలా అని శిక్షణ ఇచ్చారా అని ప్రశ్నించారు. స్పీకర్ దళితుడు అంటూ పదే పదే చెప్పడం అయన గౌరవాన్ని తగ్గించేలా చేయడమేనని ఆయన అన్నారు.






