మరోసారి కాంగ్రెస్, బీజేపీని నమ్మొద్దు

26-04-2024 12:44:56 AM

బడేబాయి చోటాబాయిలకు బుద్ధిచెప్పాలి

బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల గుండెల్లో ఉంది

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్


రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 25(విజయక్రాంతి): మరోసారి కాంగ్రెస్, బీజేపీ హామీలను నమ్మి జనాలు మోసపోవద్దని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కే తారకరామారావు కోరారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముస్తాబాద్, గంభీరావుపేట, తంగళ్లపల్లి మండలాల వారీగా తెలంగాణ భవన్‌లో క్లస్టర్‌స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల్లో చేపట్టాల్సిన ప్రచార వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. సాయంత్రం కోనరావుపేటలో నిర్వహించిన రోడ్‌షోలో బీఆర్‌ఎస్ అభ్యర్థి బీ వినోద్‌కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. ఢిల్లీలో మోదీ..హైదరాబాద్‌లో కేడీ బడేబాయి చోటాబాయిలకు బద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పదేండ్లలో మోదీ రైతుల ఆదాయం డబుల్ చేస్తామని, పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు ఖాతాల్లో వేస్తామని చెప్పి చేసిందేమీ లేదన్నారు. కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ అయిదు సంవత్సరాల్లో  ఎక్కడైనా కనిపించాడా అని ప్రశ్నించారు. గట్టిగా అడిగితే జై శ్రీరామ్ అని మాత్రమే అంటాడు.

తాము దేవుడిని అడ్డం పెట్టుకుని ఎప్పుడు రాజకీయం చేయలేదని స్పష్టం చేశారు. యాదాద్రిని అద్భుతంగా కట్టించాం..  రాజకీయంగా మాత్రం వాడుకోలేదని పునరుద్ఘాటించారు. బండి సంజయ్ లేకపోతే మనం దేవుళ్లకు మొక్కలేదా, బొట్టు పెట్టుకోలేదా.. బోనం తీయలేదా అని ప్రశ్నించారు. రాముడు దేవుడు అంటే అందరికీ గౌరవం.. నిన్న గాక మొన్న పుట్టినోల్లు మా దేవుడు అంటున్నారని అన్నారు. భాజపా లేకున్నా మన దేవుళ్లకు ఏమికాదని చెప్పారు. భాజపాకు ఓటెస్తే దేవుడికి వేసినట్టు ప్రచారం చేయడం సిగ్గు చేటన్నారు. రాజన్న ఆలయానికి, కొండగట్టు ఆలయానికి ఒక్క రూపాయి తెచ్చావా? అని నిలదీశారు. ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లేసే ప్రసక్తే లేదని అన్నారు.  సిరిసిల్లలో ఇవ్వాల ఒక్కరోజే ఇద్దరు కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కాంగ్రెస్‌తో మళ్లీ పాత రోజులు వచ్చాయని విమర్శించారు. కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నియోజకవర ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహరావు పాల్గొన్నారు.