8 June, 2026 | 2:45 AM

తప్పు బోర్డుది.. శిక్ష విద్యార్థులకా?

08-06-2026 01:39 AM

‘నీట్’ సంక్షోభం కేంద్రానిదే బాధ్యత  

పేపర్ లీక్‌లతో ప్రతిభావంతులకు అన్యాయం

ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగిస్తేనే వ్యవస్థకు బలమైన సందేశం

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

‘నీట్’ బాధితులతో ముఖాముఖి 

హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): నీట్ పేపర్ లీకేజీ సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. లోపభూయిష్టమైన వ్యవస్థ వల్ల విద్యార్థులు నష్టపోయారని, వారికి భరోసా కల్పించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని కోరారు.

తప్పు చేసిన పెద్దలపై చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ఉంటాయనే బలమైన సందేశం బ్యూరోక్రాట్లలో వెళ్తుందని స్పష్టం చేశారు. ఈనెల 4వ తేదీ సాయంత్రం మలేషియా పర్యటనకు వెళ్లే ముందు హైదరాబాద్‌లో నీట్ బాధితులు, నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులతో కేటీఆర్ ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థులు నీట్ పేపర్ లీక్‌తో తమకు జరిగిన అన్యాయాన్ని, పరీక్ష నిర్వహణలో సంబంధిత సంస్థ వైఫల్యాలపై కేటీఆర్‌కు వివరించారు.

ఇది అట్టర్ ప్లాప్ ప్రభుత్వమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ స్పందిస్తూ.. నీట్ పరీక్షను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించడంలో కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు. ఇదొక తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ లాంటిది. మీ కసిని, ఎనర్జీని సరైన దిశలో మళ్లీ ఫోకస్ చేయాలని  విద్యార్థులకు సూచించారు. గ్రేస్ మార్కులు మాయాజాలమని, ఎందుకు కలిపారో కేంద్రం వద్ద ఇప్పటికీ సరైన సమాధానం లేదన్నారు. కొంతమందికి అడ్డదారిలో మార్కులు కలిపి, కష్టపడ్డ విద్యార్థులకు అన్యాయం చేశారని మండిపడ్డారు.

పాలకులకు భయం ఉండాలి

పాలకులకు భయం ఉండాలన్నా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలన్నా.. కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్‌లు జరగకుండా ఏఐ సాంకేతికతను వినియోగించుకోవాలని కేంద్రానికి సూచించారు.

పైసలు ఉన్నవాళ్లు డొనేషన్లు కట్టి సీట్లు కొంటున్నారని, మెరిట్‌కు విలువ లేకుండా పోతోందని ఓ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేయగా.. ప్రైవేట్ కాలేజీల దోపిడీని అడ్డుకోవడానికి రెగ్యులేటరీ సిస్టమ్ అవసరమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. నీట్ పరీక్ష నిర్వహణలోని లోపాలను తమ పార్టీ ఎంపీల ద్వారా కేంద్రప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. విద్యార్థుల తరఫున బీఆర్‌ఎస్ పార్టీ పోరాడుతుందని కేటీఆర్ వారికి భరోసా ఇచ్చారు.