కేటీఆర్‌వి దిగజారుడు మాటలు
మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 6 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి ఖాయమనే భయంతోనే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ నేతలు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని రాష్ర్ట పర్యాటక, సాంస్కృతిక, ఎక్సుజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయన భావదారిద్య్రాన్ని, దివాలాకోరుతనాన్ని చాటుతున్నాయని విమర్శించారు.
గురువారం ఎర్రగడ్డ డివిజన్‌లోని మూసాపేటలో, జూబ్లీహిల్స్‌లో స్థిరపడిన కొల్లాపూర్ నియోజకవర్గ ఓటర్లతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ అరాచక పాలన చేసిన బీఆర్‌ఎస్‌కు ఓటు అడిగే నైతిక హక్కు లేదని తేల్చి చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం ఖాయమైందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఓటు వేయడమే కాకుండా, ప్రతీ ఒక్కరూ ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి ఆయన గెలుపునకు మద్దతుగా నిలవాలని కొల్లాపూర్ వాసులను కోరారు.






