11 August, 2026 | 3:26 AM

కేంద్ర విధానాలపై కార్మిక, రైతు సంఘాల సమరం

11-08-2026 12:00 AM

ఇల్లందులో భారీ ప్రదర్శన.. రాస్తారోకో

నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్

ఇల్లందు టౌన్, ఆగస్టు 10 (విజయక్రాంతి):  కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా, ట్రేడ్ యూనియన్ల పిలుపు మేరకు ఇల్లందులో సోమవారం భారీ ప్రదర్శన, రాస్తారోకో నిర్వహించారు. జగదాంబ సెంటర్ నుంచి బుగ్గవాగు వంతెన వరకు ప్రదర్శన చేపట్టి అనంతరం రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ కాశబోయిన సారయ్య, సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర నాయకులు చండ్ర అరుణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు కొక్కు సారంగపాణి, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.ఏ. నబి, ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాయిని రాజు, ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు తుపాకుల నాగేశ్వరరావు, ఏఐకేఎస్ మండల నాయకులు బొప్పిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, ప్రజలు, రైతాంగంపై భారం మోపే విద్యుత్ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరారు. దేశంలో పండుతున్న పంటలకు కనీస మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో సందర్భంగా పోలీసులు సుమారు 150 మందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. రైతు, కార్మిక సంఘాల నాయకులను స్టేషన్లో నిర్బంధించి కేసులు నమోదు చేసినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ఎం.డి. రాసుద్దిన్, అజ్మీర బిచ్చా, ఆలేటి కిరణ్, బంటు యాదగిరి, పూనెం రంగయ్య, పాయం వెంకన్న, మాదారపు వెంకటేశ్వర్లు, మల్లెల వెంకటేశ్వర్లు, ధారావత్ రాందాస్, కొప్పుల శ్రీనివాస్, పూనెం కుమార్, బానోత్ రామ్సింగ్, మహిమూద్, తిరుమలరావు, యనగంటి చిరంజీవి, రావూరి ఉపేందర్రావు, డి.మోహన్రావు, వి.మోతిలాల్ పాల్గొన్నారు.