calender_icon.png 8 December, 2025 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక హక్కులకు తూట్లు

08-12-2025 01:18:30 AM

నాలుగు లేబర్ కోడ్స్ అమలు కేంద్ర ప్రభుత్వ కుట్రల్లోని భాగమే!

-కార్పొరేట్ శక్తులకు మేలు చేసేందుకే కొత్త చట్టాలు

-అసంఘటిత కార్మికుల శ్రమను దోచేందుకు పన్నాగాలు 

- కార్మిక సంఘాల నుంచి తీవ్రమైన అభ్యంతరాలు 

-తాము ఆరోగ్య, ఉద్యోగపరమైన భద్రత కోల్పోతామని ఆందోళన

- ఐక్యంగా ఉద్యమించేందుకు కార్యాచరణ

హైదరాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): కార్మికులను అణచివేసేందుకే కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ తీసుకువచ్చిందని, వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాలు యావత్ దేశ వ్యాప్తంగా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి.

లేని పక్షంలో పోరాటాన్ని ఉధృ తం చేస్తామని హెచ్చరిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఉన్న 44 కార్మిక చట్టాల్లోని 29 చట్టాలను మార్చి నాలుగు లేబర్ కోడ్స్‌గా రూపొందించింది. వీటి ద్వారా దేశంలోని కార్మికులందరికీ ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నది.

కానీ ఈ లేబర్ కోడ్‌లు మాత్రం కార్మికుల హక్కులకు తూట్లు పొడుస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి దేశంలో ఉన్న మొత్తం కార్మిక వర్గంలో ఎక్కువ శాతం అసంఘటిత కార్మికులే ఎక్కువ. ఈ నేపథ్యంలో ప్రస్తుత లేబర్ కోడ్‌లు అసంఘటిత కార్మికులకు ఏ విధంగానూ ఉపయోగపడవని ఆరోపణలు ఉన్నాయి. పాత కార్మిక చట్టాల స్థానంలో నాలుగు కొత్త కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.

ఇప్పటికే అమ ల్లో ఉన్న 29 కార్మిక చట్టాలకు బదులుగా, వాటన్నింటినీ కలిపేసి నాలుగు చట్టాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వాటిలో కార్మికుల పరిహార చట్టం-2019, పారిశ్రామిక సంబంధాల చట్టం-2020, సామాజిక భద్రతా చట్టం-2020, వృత్తి భద్రత (ఆక్యుపేషనల్ సేఫ్టీ), ఆరోగ్యం (హెల్త్), పని ప్రదేశాల్లో పరిస్థితులు (వర్క్‌ప్లేస్ ఎన్విరాన్మెంట్) చట్టం- 2020 ఉన్నాయి. అయితే ఈ నాలుగు చట్టాలు 2025 నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చాయి.

ఒక సంవత్సరం సర్వీస్ తర్వాత గ్రాట్యుటీకి అర్హత, ఓవర్ టైమ్ పనికి రెట్టింపు వేతనం, మహిళలు రాత్రిపూట పని చేయడానికి అను మతి వంటి నిబంధనలు ఈ కొత్త చట్టాల్లో ఉన్నాయి. ఈ చట్టాలను కార్మికులు, ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకొచ్చినట్లుగా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు, ఈ చట్టాలు కార్మికుల శ్రేయస్సుకు వ్యతిరేక చట్టాలని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి.

ఈ చట్టాల్లో ఏముంది..?

- కార్మికులందరికీ నియామక పత్రాలు జారీ చేయడం తప్పనిసరి.

- కాంట్రాక్టు కార్మికులకు సెలవు, వైద్యం, సామాజిక భద్రత సహా శాశ్వత కార్మికులతో సమానమైన ప్రయోజనాలు మంజూరయ్యాయి.

- 40 ఏళ్లు వయస్సు పైబడిన కార్మికులకు ప్రతి సంవత్సరం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించాలి.

- గిగ్ వర్కర్లు, తాత్కాలిక కాంట్రాక్ట్ కార్మికుల సహా అందరూ కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్, బీమా, ఇతర ప్రయోజనాలు కల్పించాలి.

- అయితే, ఒక సంస్థలో కనీస సంఖ్యలో కార్మికులను నిర్ధ్ధారించే వరకూ ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్‌ఐ వైద్య ప్రయోజనాలు, గ్రాట్యుటీ వంటి వాటి నిబంధనలలో సడలింపు లభించలేదని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి.

- ఒక కంపెనీ నుంచి గ్రాట్యుటీ పొందాలంటే ఉద్యోగులు కనీసం 5 సంవత్సరాలు పనిచేసి ఉండాలనే నిబంధనను సవరించి, ఆ కాల పరిమితినిసంవత్సరానికి తగ్గించారు.

- చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో ఓవర్ టైం పని కోసం కార్మికులను నియమించుకుంటే, వారికి అదనపు వేతనాలు చెల్లించాలి.

- ఐటీ రంగంలో పనిచేస్తున్న వారికి ప్రతి నెల 7వ తేదీలోపు జీతాలు చెల్లించాలి.

- మహిళలు రాత్రిపూట పనిచేయడంపై ఉన్న ఆంక్షలు తొలగిపోయాయి. వారి సమ్మతితో రాత్రిపూట పనిలో వారిని యాజమాన్యాలు నియమించుకోవచ్చు.

- ఉద్యోగులను తొలగించడానికి (లే ఆఫ్), యాజమాన్యాలు తమ కంపెనీల వ్యాపారాలను తగ్గించడానికి (డౌన్ సైజ్) లేదా మూసివేయడానికి ముందస్తుగా ప్రభుత్వ అనుమతి పొందే విధానంలో మార్పులు వచ్చాయి. గతంలో, కనీసం 100 మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలు ప్రభుత్వ అనుమతి పొందవలసి వచ్చేది. కానీ ఇప్పుడు కనీసం 300 మంది ఉద్యోగులు ఉంటే అనుమతి అవసరమయ్యేలా నిబంధనలు మారాయి.

- ప్రస్తుత ప్రభుత్వ నిబంధనల ప్రకారం కంపెనీ-ఉద్యోగి మధ్య ఒక స్పష్టమైన ఒప్పందం ఉంటే ఇంటి నుంచి పని చేయడానికి (వర్క్ ఫ్రం హోం) అనుమతి ఉంది. ఇకపై ఈ నిబంధనలు ఎలా ఉండాలి, ఒక సంస్థలో ఉద్యోగులను ఎలా చూసుకోవాలి, కార్యాలయంలో ఎలాంటి నియమాలు అమలు చేయాలనే దానిపై ప్రభుత్వ మార్గదర్శకాలు ఉంటాయి.

- వాస్తవానికి, ఈ నియమాలు మొదట కనీసం 100 మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలకు వర్తింపజేయాలని ఉద్దేశించినవి. భారాన్ని తగ్గించడానికి ఆ కనీస పరిమితిని 300 మంది ఉద్యోగులకు పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దీని అర్థం ఈ నియమావళి 300 కంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న కంపెనీలకు మాత్రమే వర్తిస్తుంది.

- నిర్ణీత కాల ఉపాధిని ప్రవేశపెట్టింది. అంటే కంపెనీ, ఉద్యోగి మధ్య ప్రత్యక్ష ఒప్పందం ద్వారా నియామకం జరుగుతుంది. శాశ్వత ఉద్యోగుల మాదిరిగానే వారికి కనీస పని గంటలు, వేతనాలు కూడా అందుతాయి.

- సమ్మె నిర్వచనం మార్చినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కొత్త నిబంధనల ప్రకారం, ఒక సంస్థలోని ఉద్యోగులలో 50 శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులు సామూహికంగా సాధారణ సెలవు తీసుకుంటే, దానిని సమ్మెగా పరిగణిస్తారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం, దానిని సమ్మెగా పరిగణించేవారు కాదు.

అందరిపైనా ప్రభావం

ఇప్పటికే అమలులో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం మరో నాలుగు లేబర్ కోడ్‌లను ప్రవేశపెట్టింది. ఇవి ప్రధానంగా కీలక లేదా సంఘటిత(ఫార్మల్) రంగానికి వర్తిస్తాయి. భారత శ్రామి కశక్తి ఎక్కువ భాగం వీటి పరిధిలోకి రారు.

2019, 2020లో నాలుగు కొత్త కార్మిక కోడ్‌లను కేంద్ర కార్మిక- ఉపాధి మంత్రిత్వ శాఖ పార్లమెంటులో ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఉన్న 29 చట్టాలను విలీనం చేసి వేతనా లు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యకరమైన పని పరిస్థితులకు సంబంధించిన నాలుగు కోడ్‌లుగా రూపొందించారు.

అయితే పార్లమెంట్‌లో ఆమోదించబడి ఐదేళ్లు దాటుతున్నా ఈ లేబర్ కోడ్‌లు ఇంకా నోటిఫై చేయలేదు. దీనివల్ల అమలులోకి రాలేదు. భారతీయ మజ్దూర్ సంఫ్‌ు(బీఎంఎస్)తో సహా అన్ని కేంద్ర కార్మిక సంఘాలు ఇందులోని కొన్ని నిబంధనలను వ్యతిరేకిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశాయి. ఇది యజమానుల బాధ్యతను, భారాన్ని తగ్గిస్తుందని ఆరోపణలున్నాయి.

అసంఘటిత కార్మికులే ఎక్కువ 

ప్రస్తుతం అమలులో ఉన్న కార్మిక చట్టాలు సాధారణ భారతీయ కార్మికుల జీవితాల్లో ఎటువంటి తేడాలు చూపడం లేదు. భారతీయ కార్మిక మార్కెట్ ఎక్కువగా అసంఘటిత రంగంలో(ఇన్‌ఫార్మల్)ఉంది. కనీస వేతనాల చట్టం వంటివి మినహా కార్మిక చట్టాలలో ఎక్కువ భాగం అసంఘటిత కార్మికులకు వర్తించవు.

భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్, ఉద్యోగుల రాష్ర్ట బీమా(ఈఎస్‌ఐ) ప్రయోజనాలను పొందటానికి కొన్ని నిబంధనలు రూపొందించి ఉన్నాయి. వాటి ప్రకారం ఒక కార్మికుడికి ఈపీఎఫ్, ఈఎస్‌ఐలకు అర్హత ఉంటేనే, ఆ కార్మికుడిని సంఘటిత కార్మికుడిగా పరిగణిస్తారు. మిగిలిన వారందరూ అసంఘటిత కార్మికులే.

అంతర్జాతీయ నిర్వచనం ప్రకారం సామాజిక భద్రత లేకుండా పనిచేసే వారందరూ అసంఘటిత కార్మికుల పరిధిలోకి వస్తారు. కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన కోడ్‌లు ప్రధానంగా సంఘటిత రంగానికి వర్తిస్తాయి. అంటే సుమారు 61 కోట్ల మొత్తం శ్రామిక శక్తిలో 5 కోట్ల కంటే తక్కువ మందికి ఈ కోడ్‌లు వర్తిస్తాయి. ఫలితంగా అసంఘటిత కార్మికులలో ఎక్కువ భాగం పైన కొత్త కార్మిక కోడ్‌ల అమలు పెద్దగా ప్రభావం చూపదని కార్మిక సంఘాలు వాదిస్తున్నాయి. 

తెలంగాణలోనూ అదే పరిస్థితి..

2024 ఎన్నికల తర్వాత బీజేపీ కూటమి ప్రభుత్వాలు కొత్తగా కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను అమలు జరుపుతున్నాయి. దీనిలో భాగంగా 10 నుంచి 12 గంటల పని దినాలు అమలు జరిపేందుకు ఇటీవల కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం కూడా పచ్చ జెండా ఊపింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు క్యాబినెట్ దీనికి ఆమోదముద్ర వేసింది.

ఆంధ్రప్రదేశ్ బాటలో తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సైతం అధిక పని గంటలు అమలు జరిపేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం వాణిజ్య సంస్థల కార్మికులు, ఉద్యోగులు రోజుకు 10 గంటలు పనిచేయాలి. అయితే వారా నికి 48 గంటల కన్నా ఎక్కువ పని చేయడానికి వీలు లేదనీ, అంతకుమించి పనిచేస్తే ఓవర్ టైం వేతనాలు చెల్లించాలని, కార్మిక శాఖ ఉత్తర్వుల్లో ఉన్నప్పటికీ ఓవర్ టైం పనిచేయడానికి పరిస్థితులు సహకరించని వాళ్లను పని నుంచి తొలగించే అవకాశాలు ఏర్పడతాయి. యాజమాన్యాలు తమ అధిక లాభాల కోసం ఓవర్ టైం చేయాలని కార్మికులు, ఉద్యోగుల మీద ఒత్తిడి చేసే అధికారం నూతన లేబర్ కోడ్లు ఇస్తున్నాయి.

ప్రమాదంలో కార్మికుల హక్కులు

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన 2020 పారిశ్రామిక సంబంధ నాలుగు లేబర్ కోడ్ల వల్ల కార్మిక వర్గం హక్కులు ప్రమాదంలో పడతాయి. ఈ కొత్త చట్టాల ప్రకారం కార్మికులు తమ హక్కుల కోసం సమ్మె చేయడానికి అనేక ఆటంకాలు ఉన్నాయి.

100 మంది కంటే తక్కువ మంది కార్మికులు పనిచేస్తున్నసంస్థల నుంచి వారిని తొలగించడం యాజమాన్యాలకు సులభం అవుతుంది. కార్మిక సంఘాల ఏర్పాటు చేసుకోవడం క్లిష్టంగా తయారవుతుంది. 10 మంది కంటే తక్కువ కార్మికులు పనిచేసే కంపెనీలో వృత్తిపరమైన భద్రత, ఆరోగ్య సంక్షేమం వంటి హక్కులు కోల్పోతారు.

నాలుగో లేబర్ కోడ్ అమలు ద్వారా కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్, గ్రాట్యుటీ రక్షణ లేకుండా పోతుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న కోటి మందికి పైగా కార్మికులకు ఈ కోడ్ వల్ల ప్రయోజనం లేకుండా పోతుంది. నాలుగు లేబర్ కోడ్లు దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు జరిగితే వివిధ రంగాల కార్మికులు, ఉద్యోగుల జీవి తాలు దుర్భరంగా దిగజారిపోతాయి.

సంఘాలు సంఘటితం

రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తూ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను పాతర వేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఫెడరల్ స్ఫూర్తికి భంగం కలిగిస్తూ ఆయా రాష్ట్రాలలో బీజేపీయేతర ప్రభుత్వాలను ఇరుకున పెట్టే చర్యలకు పాల్పడుతున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

ఈ దేశ ప్రజల భవిష్యత్తుని కార్పొరేట్లకు తాకట్టు పెట్టే పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిస్తున్నారు. కార్మికులు ఎన్నో ఏళ్లు పోరాటం చేసి సాధించుకున్న చట్టాలను కాపాడుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వామ పక్ష, ప్రజాతంత్ర, సెక్యులర్ పార్టీలూ, ప్రజాసంఘాలు, కార్మిక ఉద్యోగ సంఘాలూ దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నాయి.    

ట్రేడ్ యూనియన్లను రద్దు చేసే కుట్ర 

బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరిట బడా పెట్టుబడిదారులకు ఉపయోగపడేటట్టుగా 29 కార్మిక చట్టాలను మార్పు చేసి నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకొస్తున్నారు. వీటి వల్ల కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. బీజేపీ ప్రభుత్వం కార్మికులు అడిగారని ఈ కోడులను అమలు చేయడం లేదు.

పెట్టుబడిదారులు అడిగారని చేస్తున్నారు. లేబర్ కోడ్‌ల అమలుతో కార్మికులకు నష్టాలు కలుగుతాయి. ముఖ్యంగా కార్మికుల ఓటీ, పని గంటల మీద ఉన్న నియంత్రణ, ఉద్యోగ భద్రత పోవడంతోపాటు కార్మికుల సంక్షేమ కార్యక్రమాలన్నీ రద్దు అవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే ట్రేడ్ యూనియన్లను రద్దు చేసే కుట్ర జరుగుతోంది. రాంబాబు యాదవ్, బీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు


పెట్టుబడిదారులకు సేవ చేసేందుకే.. 

నాలుగు లేబర్ కోడులను పార్లమెంట్‌లో పెద్దగా చర్చ లేకుండానే కేంద్రం ఆమోదించింది. ప్రస్తుతం అమలు చేస్తున్న లేబర్ కోడ్‌ల ద్వారా దేశంలోని అత్యధిక మంది కార్మికులను చట్టాల పరిధిలోకి రాకుండా చేస్తున్నది. కాంట్రాక్ట్ లేబర్ చట్టంలోని హక్కులు వర్తించే కార్మికుల సంఖ్యను రెట్టింపు అయింది.

ప్రస్తుతం అమలు చేస్తున్న నిబంధనల లోపు కార్మికులు ఉన్న పరిశ్రమల్లో ఈ చట్టం పనికిరాదు. వాస్తవానికి ఉన్న చట్టాలే సరిగా అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పుడు ఆ చట్టాలను కోడుల రూపంలో మార్చేసి అసంఖ్యాక కార్మికులను చట్టాల పరిధిలోకి రాకుండా చేస్తున్నారు. బడా పెట్టుబడిదారులకు సేవ చేసేందుకే ఈ చట్టాలు. అందుకే వీటిని వ్యతిరేకిస్తున్నాం. 

 బూర్గుల ప్రదీప్, ఐఎఫ్‌టీయూ నేషనల్ వైస్ ప్రెసిడెంట్

రద్దు చేసే వరకు పోరాటం ఆగదు 

ప్రస్తుతం అమలు చేస్తున్న లేబర్ కోడులు పెట్టుబడి దారుల కోసం తీసుకొచ్చినవే. సులభతరంగా వ్యాపారాలు చేసుకుని కార్మిక చట్టాలను బుల్డోజ్ చేసేందుకే రూపొందించారు. వీటి ద్వారా గతంలోని చట్టాలు, యూనియన్లు పోవడంతోపాటు పని గంటలు పెరగడం, ఉద్యోగ భద్రత కూడా ఉండదు.

అందుకే వీటికి వ్యతిరేకంగా ఆరేళ్ల నుంచి పోరాటం చేస్తున్నాం. తక్షణమే ఈ లేబర్ కోడులను కేంద్ర ప్రభుత్వం మార్చుకోవాలి. లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా లేబర్ కోడులకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి. లేబర్ కోడులు రద్దు చేసే వరకు పోరాటం మాత్రం ఆగదు.  

 పాలడుగు భాస్కర్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

తెలుసుకోవాల్సిన మార్పులు

- ఫిక్స్‌డ్‌టర్మ్ ఉద్యోగులు, ఐటీ, తయారీ, మీడియా, లాజిస్టిక్స్, సేవలలో సాధారణంగా కనిపించే సమయ- పరిమిత కాంట్రాక్టులపై నియమించబడిన కార్మికులు, ఇప్పుడు ఐదేళ్ల  సేవకు బదులుగా కేవలం ఏడాది సేవ తర్వాత గ్యాట్యుటీ పొందవచ్చు.

- వార్షిక వేతనంతో కూడిన సెలవుకు అర్హత సాధించడానికి ఉద్యోగులు ఇప్పుడు సంవత్సరానికి 180 రోజుల పని చేయాలి. గతంలో ఈ పరిమితి 240 రోజులు ఉండేది.

- ఎనిమిది గంటల పనిదినం, వారానికి నలభై ఎనిమిది గంటల పనిదినాలు మిగిలి ఉన్నాయి, కానీ ప్రభుత్వాలు ఇప్పుడు వారపు షెడ్యూల్‌ను రూపొందించడానికి మరింత సౌలభ్యాన్ని కలిగి ఉన్నాయి. అవి నాలుగు దీర్ఘ రోజులు, ఐదు మధ్యస్థ రోజులు లేదా ఆరు ప్రామాణిక రోజులు.

- ఓవర్ టైం స్వచ్ఛందంగా ఉండాలి. సాధారణ రేటుకు రెండింతలు చెల్లించాలి. రాష్ట్రాలు ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువ ఓవర్ టైం పరిమితులను అనుమతించవచ్చు.

- ప్రతి కార్మికుడు వేతనాలు, విధులు, పని గంటలు, హక్కులను వివరించే లిఖిత నియామక లేఖను పొందాలి. దీనితో చాలా మంది కార్మికులు, ముఖ్యంగా సేవలు, ట్రేడ్‌లు, మీడియాలో ఎదుర్కొన్న అస్పష్టత తొలగిపోతుంది.

- కనీస వేతనాలు ఇప్పుడు షెడ్యూల్డ్ పరిశ్రమలలోనే కాకుండా అన్ని రంగాలకు వర్తిస్తాయి. కేంద్రం జాతీయ స్థాయిలో కనీస వేతనాన్ని నిర్ణయిస్తుంది. ఏ రాష్ర్టమూ దాని కంటే తక్కువ వేతనాలను నిర్ణయించదు.

- చాలా సందర్భాల్లో యజమానులు మొత్తం సీటీసీని సర్దుబాటు చేయకపోతే టేక్‌హోమ్‌సాలరీ కొద్దిగా తగ్గవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జీతంలో ఎక్కువ భాగం చట్టబద్ధమైన వేతన బేస్ కిందకు వస్తుంది. అధిక పీఎఫ్ లేదా గ్రాట్యుటీ తగ్గింపులను ఆకర్షిస్తుంది.

- గతంలో సకాలంలో వేతన నియమాలు ఒక నిర్దిష్ట పరిమితి కంటే తక్కువ సంపాదించే వారికి మాత్రమే వర్తిస్తాయి. ఇప్పుడు ప్రతి ఉద్యోగి కూడా ఈ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ఆలస్యమైన జీతాలు జరిమానాలతో వస్తాయి. ప్రాథమిక ఆర్థిక భద్రతను బలోపేతం చేస్తాయి.

- ఒక కార్మికుడు ఇంటికి, కార్యాలయానికి మధ్య ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదానికి గురైతే నిర్దిష్ట పరిస్థితులలో దానిని ఉద్యోగ సంబంధిత ప్రమాదంగా పరిగణిస్తారు. ఇది పరిహారం, బీమా, ఈఎస్‌ఐ ప్రయోజనాలను పొందే అవకాశాన్ని మెరుగుపరుస్తుంది.

- జర్నలిస్టులు, ఓటీటీ కార్మికులు, డిజిటల్ క్రియేటర్లు, డబ్బింగ్ కళాకారులు, సిబ్బంది ఇప్పుడు వేతనాలు, పని గంటలు, హక్కులను స్పష్టంగా జాబితా చేసే అధికారిక నియామక లేఖలను పొందవచ్చు.