4 March, 2026 | 3:14 AM

నేతల జేబులు పుల్.. ఖజానా నిల్!

04-03-2026 01:09 AM

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కలిసి మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాయి

  1. రుణాలు తీసుకోకుండా ఒక్క పనీ చేయని సర్కార్ 
  2. ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి
  3. సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ

హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చి, సీఎం పదవిని చేపట్టిన తర్వాత రాష్ట్ర ఖజానాలో లంకెబిందెలకు బదులు ఖాళీ మట్టి కుండలున్నాయంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.

ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ముందుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఒక పూర్తిస్థాయి శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని తెలంగాణ ప్రజల తరఫున సీఎంను కోరుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఖజానా గురించి ఇలా మాట్లాడిన మీరే(సీఎంను ఉద్దేశించి), ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ సోని యా గాంధీ గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్‌కు అవసరమైతే రూ.వెయ్యి కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

మీరు మాట్లాడిన తీరును చూస్తుంటే రాష్ట్ర ఖజానా నిల్-కాంగ్రెస్ నేతల జేబులు ఫుల్ అన్న విషయం అర్థమవుతోందని పేర్కొన్నారు. తెలంగాణ ఆర్థిక పరి స్థితికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక  శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్‌రెడ్డి మంగళవారం లేఖ రాశారు. 

2014లో నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అనేక రకాలుగా సహాయ, సహకారాలను అంది స్తూ వస్తోందన్నారు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు, మరెన్నో మూలధన పెట్టుబడులు మొదలైనవాటి రూపంలో గత  పన్నెండేళ్లలో దాదాపు రూ. 12 లక్షల కోట్ల నిధులను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు.

అందులో రూ.2.5 లక్షల కోట్ల పన్నుల వాటా నిధులు, రూ.1.85 లక్షల కో ట్ల విలువైన రహదారుల నిర్మాణం, దాదా పు రూ.36,000 కోట్లకు పైగా రైల్వే బడ్జెట్ కేటాయింపులు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మరో రూ. 50,000 కోట్ల విలువైన రైల్వే పనులు, దాదాపు రూ.40,000 కోట్ల ఉపాధి హామీ నిధులు, రూ.50,000 కోట్ల ఉచిత రేషన్ బియ్యం పంపిణీ, గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు వివిధ ఆర్థిక సంఘాల సిఫారసుల ద్వారా అందిస్తున్న రూ.40, 000 కోట్లకు పైగా నిధులు, రూ.12,000 కోట్లకు పైగా విలువైన విద్యుత్ ప్రాజెక్టులు, రూ.14,000 కోట్లకు పైగా పీఎం కిసాన్ నిధులు, ఎరువుల సబ్సిడీ కోసం రూ. 80,000 కోట్లకు పైగా నిధులు, విద్య  క్రీడలకు రూ.21,000 కోట్లకు పైగా నిధులు, దా దాపు రూ.9,000 కోట్ల ఆరోగ్య సంరక్షణ ని ధులు మొదలైనవి ఉన్నాయని లేఖలో వివరించారు. 

తెలంగాణ రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల రుణాలు..

అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాల కాలంలో దాదాపు రూ.2 లక్షల కోట్ల కనీస మద్దతు ధరను చెల్లించి, తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని సేకరించిందని, మరో రూ.60,000 కోట్ల కనీస మద్దతు ధరను చెల్లించి, తెలంగాణ రైతుల నుంచి పత్తిని సేకరించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులను ఇవ్వడమే కాకుండా, వివిధ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థల ద్వారా దాదాపు రూ.10 లక్షల కోట్ల రుణాలను కూడా తెలంగాణ రాష్ట్రానికి అందించిందన్నారు.

వీటికి అదనంగా రాష్ట్రాల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన మూలధన పెట్టుబడి నిధుల కోసం రాష్ట్రాలకు 50 సంవత్సరాల కాలపరిమితితో కూడిన వడ్డీ రహిత రుణాలను అందించి ఆయా రాష్ట్రాల అభివృద్ధికి అదనపు సహకారాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వం స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ పేరిట ఒక నూతన పథకాన్ని 2020--21 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించిందని పేర్కొన్నారు. 

ప్రతి పనికీ రుణాలే..

రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలకు కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ రహిత రుణాల మీద ఆధారపడటం చూస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎలాంటి దుస్థితిలో ఉందో తెలుస్తోందనని తెలిపారు. ఇవి మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న రుణాలకు వడ్డీలు చెల్లించడానికి రుణాలు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి రుణాలు, రైతు భరోసా నిధులకు రుణాలు, సంక్షేమ పథకాల అమలుకు రుణాలు ఇలా చెప్పుకుంటూ పోతే రుణాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేని పరిస్థితి నేడు తెలంగాణలో ఉందన్నారు. 

మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా..

2014లో మిగులు నిధులతో ఏర్పడిన రాష్ట్రానికి గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో, గత 27 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు పట్టిన దుస్థితికి నేటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్దం పడుతోందని విమర్శించారు. ప్రతి సంవత్సరం పెరుగుతున్న రాష్ట్ర తలసరి అప్పు కూడా రాష్ట్ర ఆర్థిక దుస్థితిని తెలియజేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన వాస్తవాలను తెలంగాణ ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు.