హోర్ముజ్ దిగ్బంధం
- జలసంధిని మూసేసినట్లు ఇరాన్ ప్రకటన
నౌకలు కదిలితే పేల్చేస్తామని హెచ్చరిక
టెహ్రాన్, మార్చి ౩: హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పతాక స్థాయి కి చేరుకున్నాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధ ప్రభావం చమురు రవాణా చేసే నౌకలపైనా పడింది. ఇరాన్ సైన్యం ఈ జలసంధిని మూసివేస్తున్నట్లు తాజాగా సంచలన ప్రకటన చేసింది. జలసంధి గుండా నౌకలు కదిలే ప్రయత్నం చేస్తే పేల్చివేస్తామని హెచ్చరించింది.
దీంతో జలసంధిలో సుమారు 700కు పైగా చమురు నౌకలు ఎక్కడికక్కడ నిలిచిపోయా యి. జలసంధి నుంచి సౌదీ అరేబి యా, కువైట్, ఇరాక్, ఖతార్, యూఏ ఈ వంటి దేశాల నుంచి క్రూడ్ ఆయి ల్, గ్యాస్ ట్యాంకర్లు భారత్, చైనా, దక్షిణ కొరియా, జపాన్‌కు రవాణా అవుతాయి. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో మరో 150 నౌకలు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుని అంతర్జాతీయ జలాల్లో లంగర్లు వేసి వేచి చూస్తున్నాయి.
యుద్ధానికి ముందు జలసంధి నుంచి రోజుకు 130 నౌకలు ప్రయాణించేవి. నిబంధనలను ఉల్లంఘించి జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన ఒక చమురు నౌకపై ఇరాన్ దాడి చేయడంతో మిగతా నౌకలు ఒక్క అడుగు ముందుకు వేసేందుకు సైతం భయపడుతున్నాయి. యావత్ ప్రపంచానికి వెళ్లే ముడి చమురులో ౨౦శాతం ముడి చమురు ఈ జలసంధి గుండానే వెళ్తుంది. ప్రస్తుతం ఈ మార్గం మూతపడటంతో ఆసియా దేశాలు చమురు కొరత ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నది. బీమా కంపెనీలు కూడా ఈ ప్రాంతంలో ప్రయాణించే నౌకలకు బీమాను రద్దు చేశాయి.
దీంతో నౌకల యజమానులు భారీ ఆర్థికపరమైన నష్టాలను ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయ సమాజం ఇరాన్‌పై ఒత్తిడి తెస్తున్నప్పటికీ, ఆ దేశం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ప్రభావిత దేశాల్లో ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ జలసంధిగా గుర్తింపు ఉన్న ఈ మార్గంలో వాణిజ్య నౌకల ప్రయాణానికి అడ్డుచెప్పే హక్కు లేదని అమెరికా వాదిస్తోంది. 1980వ దశకంలో జరిగిన యుద్ధం తర్వాత ఇరాన్ మళ్లీ ఇంతటి తీవ్రమైన హెచ్చరికలు చేయడం ఇదే మొదటిసారి.
భారత్‌పై ప్రభావం..
భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 80 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నది. దీనిలో సింహభాగం గల్ఫ్ దేశాల నుంచే దిగమతి అవుతుంది. భారత్ ఎక్కువగా ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ నుంచి చమురును దిగుమతి చేసుకుంటుంది. హోర్ముజ్ జలసంధి మూసివేత వల్ల ఈ దేశాల నుంచి వచ్చే ట్యాంకర్లు నిలిచిపోతాయి. చమురు దిగుమతుల కోసం మనం చేసే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది.
అయినప్పటికీ, ఇంధనం, గ్యాస్ ధరలు పెంచబోమని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం భారత్ వద్ద 50 రోజులకు సరిపడా ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
దీనిలో శుద్ధి చేసిన చమురు, ఇంధనాలు ౨౫ రోజులకు సరిపోయేంత ఉన్నాయని తెలిపాయి. అయితే.. ఈ అంశంపై తాజాగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరి కీలక ప్రకటన విడుదల చేశారు. భారత్ తన చమురు అవసరాలకు కేవలం హోర్ముజ్ జలసంధిపైనే ఆధారపడటం లేదని, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కూడా దిగుమతులు చేసుకుంటున్నామని తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్లు కుదేలు..
మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో కుదలేవుతున్నాయి. చమురు ధరలు పెరగడం వల్ల స్టాక్ మార్కెట్లు కూడా కుప్పకూలే ప్రమాదం ఉంది. రూపాయి విలువ మరింత క్షీణించే అవకాశం ఉంది. ఈ పరిణామం మదపర్ల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుంది. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో సుమారు కోటి మంది భారతీయులు ఉపాధి పొందుతున్నారు.
యుద్ధం వల్ల వారు తిరిగి భారత్‌కు రావాల్సి వస్తే, మన దేశానికి వచ్చే విదేశీ మారకద్రవ్యం (రెమిటెన్స్) తగ్గిపోతుంది. అదే జరిగితే.. కేరళ వంటి రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం చూపుతుంది. ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్ తన దౌత్య సంబంధాలను ఉపయోగించి రష్యా వంటి ఇతర దేశాల నుంచి చమురు సేకరించాల్సి ఉంటుంది.




