4 March, 2026 | 3:37 AM

పాలమూరుకు మళ్లీ బ్రేక్!

04-03-2026 01:20 AM

చివరిదశలో నిలిచిన పీఆర్‌ఎల్‌ఐ ప్రాజెక్ట్

విడుదల కాని రూ. 2,000 కోట్ల బకాయిలు

ఆర్థిక శాఖ నిధులు ఇచ్చేనా?.. మంత్రి ఉత్తమ్ ప్రయత్నాలు

పరిహారం కోసం నిర్వాసితుల ఎదురుచూపులు

ప్రాజెక్టు పూర్తయితే 12 లక్షల ఎకరాలకు నీరు

హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): ఉమ్మడి మహబూబ్‌నగర్‌తో పాటు ఆరు జిల్లాలకు సాగునీరు అం దించడమే లక్ష్యమైన పాలమూరు- ఎత్తిపోతల ఇరిగేషన్ ప్రాజె క్టు (పీఆర్‌ఎల్‌ఐఎస్) నిధుల కొరతతో  చివరి దశలో నిలిచిపోయింది. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో నిర్మాణ పనులు 80 శాతానికి పైగా పూర్తయిన ఇరిగేషన్ ప్రాజెక్టుకు మళ్లీ బ్రేక్‌లు పడ్డా యి. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన సుమారు రూ. 2,000 కోట్ల బకాయి లు, నిర్వాసితుల పరిహారం నిధులు ఆగిపోయాయి. ఆరు రిజర్వాయర్లు డ్రైవ్ రన్‌కు సిద్ధంగా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ నిధులు విడుదల చేయలేదు.

దీంతో లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పాలమూరు ప్రాజెక్టు ప్రారంభం మళ్లీ అనిశ్చి తిలో పడింది. అయితే ఈ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శతవిధాల ప్రయత్నిస్తున్నారు. పాలమూరు ప్రాజెక్టుకు పెండింగ్ నిధులు విడుదల కాకపోవడంతో కీలక రిజర్వాయర్లు, పంప్ హౌసులు, కాల్వల పనులు నత్తనడకన సాగుతున్నాయి. మోటార్లు డ్రైరన్‌కు సిద్ధంగా ఉన్నా ప్రారంభించలేని పరిస్థితి నెలకొంది.

కేవలం 2.5 కి.మీ కాల్వ పనులు పూర్తయితే నాలు గు రిజర్వాయర్లలో నీటిని నింపే అవకాశం ఉన్నప్పటికీ బకాయిలు, పరి హారం వివాదాలు ప్రాజెక్టుకు చివరిదశలో బ్రేక్ వేస్తున్నాయి. ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న అంజనగిరి, వీరాంజనేయ, వెంకటాద్రి, కురుమూర్తిరాయ, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల పనులు చివరి దశకు చేరుకున్నాయి. పంప్‌హౌస్‌లు, మోటార్ల అమరిక, కాంక్రీట్ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. అయినప్పటికీ కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన 2వేల కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో  పనులు ముందుకు కదలడం లేదు.

పాలమూరు ప్రాజెక్టుకు సంబంధిం చిన పెండింగ్ నిధులు విడుదలలో జాప్యం కారణంగా ఉద్దండాపూర్ పంప్‌హౌస్ పను లు నిలిచిపోయాయి. ఏదుల, వట్టెం ప్రాం తాల్లో లైనింగ్, నిర్మాణ పనులు మందగించాయి. పలు ప్యాకేజీల్లో పనులు పూర్తిగా ఆగిపోయాయి. కాంట్రాక్టర్లు నిధులు విడుదలైతేనే పనులు వేగవంతం చేస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే నార్లాపూర్ నుంచి ఏదుల వరకు 16 కి.మీ సొరంగం నిర్మాణం పూర్తయింది. కానీ అక్కడి నుంచి నీటిని తరలించేందుకు అవసరమైన ఓపెన్ కాల్వలో కీలకమైన 2.5 కి.మీ పనులు ఇంకా పూర్తికాలేదు.

దీంతోపాటు భారీ స్థాయిలో మట్టి తొలగింపు పనులు పెండింగ్‌లో ఉన్నా యి. కాల్వ నిర్మాణం నెమ్మదిగా సాగుతోం ది. ఈ పనులు పూర్తయితే నాలుగు ప్రధాన రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసే అవకాశం ఉన్నప్పటికీ, నిధుల కొరతతో పనులు నిలిచిపోయాయి. నార్లాపూర్, ఏదుల, వట్టెం, ఉద్దండాపూర్ పంప్‌హౌస్‌ల్లో మోటార్లను అ మర్చడం దాదాపు పూర్తయింది. కొన్ని మో టార్లు డ్రైరన్‌కు సిద్ధంగా ఉన్నప్పటికీ, కాల్వలు పూర్తికాకపోవడం, రిజర్వాయర్లలో నీటి నిల్వ ప్రారంభం కాకపోవడంతో వాటి ని వినియోగంలోకి తీసుకురాలేకపోతున్నారు.  

కొన్ని మోటార్లు సిద్ధంగా ఉన్నా..

పాలమూరు ఎత్తిపోతల పథకంలో కీలకమైన నాలుగు రిజర్వాయర్లు వంద శాతం పనులు దాదాపు పూర్తయినా ఆగిపోయాయి. అందులో 6.8 టీఎంసీల సామర్థ్యం గల అంజనగిరి రిజర్వాయర్ వంద శాతం పనులు పూర్తయ్యాయి. 8.55 టీఎంసీల సామర్థ్యం గల వీరాంజనేయ రిజర్వాయర్ 96 శాతం, 16.58 టీఎంసీల సామర్థ్యం గల వెంకటాద్రి 90 శాతం, 19.15 టీఎంసీల సామర్థ్యం గల కురుమూర్తిరాయ రిజర్వాయర్ 80 శాతం పనులు పూర్తయి నిలిచిపోయాయి. 

15.91 టీఎంసీల సామర్థ్యం గల ఉద్దండాపూర్ రిజర్వాయర్ వద్ద పంప్‌హౌస్, స్పిల్ వే పనులు ఇంకా పూర్తి కాలేదు. నార్లాపూర్ నుంచి ఏదుల వరకు సొరంగం సిద్ధం గా ఉన్నప్పటికీ, కుడికుళ్ల మధ్య 2.5 కి.మీ ఓపెన్ కాల్వ పనులు పెండింగ్‌లో ఉండటంతో నీటి తరలింపు ప్రారంభం కాలేదు.

సుమారు 15 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులు పూర్తి కావాల్సి ఉంది. మరోవైపు నార్లాపూర్‌లో 8 మోటార్లకు 4, ఏదులలో 10 మోటార్లకు 5, వట్టెంలో 10 మోటార్లకు 5, ఉద్దండాపూర్‌లో 3 మోటార్లు సిద్ధంగా ఉన్నాయి. అయితే నిర్వాసితుల పరిహారం సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వాటిని ప్రారంభించలేని పరిస్థితి నెలకొంది.  

నిర్వాసితుల పరిహారం కూడా..

నార్లాపూర్, ఏదుల పరిధిలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం పూర్తిగా చెల్లించలేదని తెలుస్తోంది. దీంతోపాటు పునరావాస కాలనీల్లో ప్లాట్ల కేటాయింపు కూడా ఆలస్యమవుతున్నదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిహారం చెల్లింపుల్లో నెలకొన్న వివాదాల కారణంగా నిర్వాసితులు ముంపు ప్రాంతాలను ఖాళీ చేయని పరిస్థితి వచ్చింది. దీంతో రిజర్వాయర్ల పరిధిలో మిగిలిన పనులు పూర్తికాకుండా నిలిచిపోయాయి.

ఈ ప్రాజె క్టు పూర్తయితే నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, రంగారెడ్డి, వికారా బాద్, నల్లగొండ జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 70 మండలాలకు తాగు నీరు అందాల్సి ఉంది. వాస్తవానికి పాలమూరు ప్రాంతానికి ఈ ప్రాజెక్టు జీవనాడిగా మారాల్సి ఉంది. అయితే బకాయిలు విడుదల కాకపోవడం, నిర్వాసితుల పరిహారం సమస్యలు కొనసాగుతుండటంతో ప్రాజెక్టు ప్రారంభం మళ్లీ అనిశ్చితిలో పడింది. అయితే, ఆర్థిక నిధులు విడుదల చేస్తేనే ప్రా జెక్టు పనులు ముందుకు సాగే పరిస్థితులు నెలకొన్నాయి.