కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి శ్రావణ శోభ
కొమురవెల్లి, ఆగస్ట్ 30 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి(Komaravelli Mallikarjuna Swamy) దేవాలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం(Shravan month) సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి భక్తులకు గంటన్నరకు పైగా సమయం పట్టింది. ఆదివారం ఉదయం నుంచి మల్లన్న క్షేత్రంలో భక్తుల కొలహాలం మొదలైంది. ముందుగా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామి వారి కోనేట్లో పుణ్యస్నానం ఆచరించిన అనంతరం స్వామివారిని దర్శనం చేసుకున్నారు.
అనంతరం ముఖ మండపం, గంగిరేణి చెట్టు కింద బోనాలు చెల్లించి, పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. కొంతమంది భక్తులు స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అదేవిధంగా గుట్టపై ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించిన అనంతరం, భక్తితో తల్లిని వేడుకున్నారు. శ్రావణమాసం కావడంతో మల్లన్న ఆలయ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. ఆలయ పార్కింగ్ ప్లేసులు భక్తుల వాహనాలతో నిండిపోయాయి. భక్తుల రద్దీకి తగ్గట్టు ఆలయ వర్గాలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశారు.
వెండి బిందె విరాళం
కొమరవెల్లి గ్రామానికి చెందిన అంబటి పల్లి యాదలక్ష్మి వెండి బిందెను ఆలయ సిబ్బందికి అందజేశారు. ఒక కిలో 800 గ్రాముల బరువుగాల ఈ బిందె కు సుమారు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అయినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలతో సత్కరించి, అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున్, పర్యవేక్షకులు నీల చంద్రశేఖర్, కుటుంబ సభ్యులు అంబటి పల్లి మల్లికార్జున్, నరేందర్, రాము తదితరులు పాల్గొన్నారు.






