అయోధ్యలో భూములు లాక్కుని ఎయిర్ పోర్టు కట్టారు: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్షనేతగా రాహుల్‌గాంధీ తొలి ప్రసంగించారు. రాజ్యాంగానికి తాము రక్షణగా నిలబడతామని పేర్కొన్నారు. విపక్ష నేతలను ఈడీ, సీబీఐలతో వేధిస్తున్నారని తెలిపారు. ఈడీ నుంచి 55 గంటల విచారణ ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. అధికారం కంటే నిజం గొప్పది... ప్రతిపక్షంలో ఉన్నందుకు సంతోషంగా ఉన్నా, గర్వపడుతున్నానని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
అయోధ్య మందిర ప్రారంభ సమయంలో బాధితులు దు:ఖంలో ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారు. అయోధ్య మందిర ప్రారంభానికి కనీసం ఆలయ పరిసరాల్లోకి రానివ్వలేదని రాహుల్ ఆరోపించారు. అయోధ్య మందిర ప్రారంభానికి కార్పొరేట్లకు మాత్రం ఆహ్వానం అందిందని ఆయన విమర్శించారు. అయోధ్యలో భూములు లాక్కుని విమానాశ్రయం నిర్మించారని తెలిపారు. చిరు వ్యాపారులు దుకాణాలు, భవనాలు తొలగించి వారిని రోడ్డుపైకి నెట్టారని మండిపడ్డారు. విపక్షాలన్నీ కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నాయని రాహుల్ పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకున్నాని తెలిపారు. ధరల పెరుగుదల వల్ల నిత్యావసరాలు కొనలేకపోతున్నామని చాలా మంది చెప్పారన్నారు. నిత్యావసరాలు కొనలేక మహిళలు అనేక బాధలు పడుతున్నారని వెల్లడించారు.






