తెలంగాణలో ‘ల్యాండ్’ లాటరీ..
- కోకాపేట గజం రూ.47,600.. ఓపెన్ మార్కెట్లో ఎకరం రూ.237 కోట్లు!
- రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన కొత్త భూముల ప్రభుత్వ విలువలు
- కనీసం 10% నుంచి గరిష్టంగా 100% (డబుల్) పెంచిన రెవెన్యూ శాఖ
- వ్యవసాయ భూములు, ఓపెన్ ప్లాట్ల ధరలకు రెక్కలు.. అపార్ట్‌మెంట్లపై స్వల్ప పెంపు
- రిజిస్ట్రేషన్ ఛార్జీలు 7.5 శాతమే.. మార్పు లేదన్న ప్రభుత్వం
సిటీబ్యూరో, జూలై 9 (విజయక్రాంతి): తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సరికొత్త సంచలనం మొదలైంది. ఓపెన్ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ రేట్లకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేందుకు రాష్ట్రవ్యాప్తంగా భూముల ప్రభుత్వ విలువలను రెవెన్యూ శాఖ భారీగా పెంచింది. కనీసం 10 శాతం నుంచి గరిష్టంగా 100 శాతం వరకు సవరించిన నూతన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని మొత్తం 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాల యాల్లో కొత్త విలువల ప్రకారమే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ శరవేగంగా సాగుతోంది.
కోకాపేటలో ‘డబుల్’ ధమాకా..
హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని కోకాపేట భూముల ప్రభుత్వ విలువ రాత్రికి రాత్రే డబుల్ అయింది.ఇంతకాలం చదరపు గజం రేటు రూ.23,800 ఉంటే, ఇప్పుడది రూ.47,600 కు చేరింది. దీని ప్రకారం ఎకరం కమర్షియల్ ల్యాండ్ ప్రభుత్వ వాల్యూ సుమారు రూ.24 కోట్లుగా ఫిక్స్ అయింది.అయితే ఓపెన్ మార్కెట్ రేటు దీనికి పది రెట్ల కంటే ఎక్కువే ఉంది. ఇటీవలి వేలంలో ఇక్కడ ఒక ఎకరం ధర గరిష్టంగా రూ.237 కోట్లు పలికి దేశవ్యాప్తంగా రికార్డు సృష్టించింది. కోకాపేట తరహాలోనే కొంగరకలాన్, బుద్వేల్, హఫీజ్పేట్, రాయదుర్గం, నాగోల్ వంటి ఓఆర్‌ఆర్ పరిసర ప్రాంతాల్లోనూ ధరలు భారీగా పెరిగాయి.
వ్యవసాయ భూములకూ ‘బంగారు’ ధర..
గ్రామీణ, పట్టణ పరిసరాల్లోని వ్యవసాయ భూముల మార్కెట్ విలువను ప్రభుత్వం 50% నుంచి 100% మేర పెంచింది. రాష్ట్రంలో వ్యవసాయ భూముల కనీస విలువ ఎకరాకు గతంలో రూ.1.75 లక్షలు ఉంటే, ఇప్పుడది రూ.2.75 లక్షలకు చేరింది.
అపార్ట్మెంట్ చదరపు అడుగు విలువ..
హైదరాబాద్లోని ఆజంపురా, మసాబ్ట్యాంక్లలో రూ.2,500 నుంచి రూ.2,700 కు పెరిగింది. బాలానగర్, పటాన్చేరు ప్రాంతాల్లో ఎస్‌ఎఫ్టీ ధరను రూ.3,000 గా ఫిక్స్ చేశారు.భూముల మార్కెట్ విలువలు పెరిగినప్పటికీ, రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలను మాత్రం ప్రభుత్వం పెంచలేదు. పాత పద్ధతిలోనే 7.5 శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు యథావిధిగా కొనసాగనున్నాయి. కేవలం అభివృద్ధి వేగంగా జరుగుతున్న ఓఆర్‌ఆర్ పరిధి, ప్రధాన రహదారులు, వాణిజ్య కేంద్రాల సమీప ప్రాంతాల్లోనే ఈ పెంపు ఎక్కువగా ఉందని అధికారులు వెల్లడించారు.






