గెలుపునకు మహిళలే టార్గెట్!
దేశంలో రాజకీయ పార్టీలు గెలుపు కోసం తమ రాజకీయ వ్యూహాలను మార్చుకుంటున్నట్లుగా కనపడు తోం ది. ఒకనాడు ఉచితాలకి వ్యతిరేకమని చెప్పిన పార్టీలు కూడా ఎన్నికలలో విజయం కోసం తమ మ్యానిఫెస్టోలలో ఉచితాలకి, సంక్షేమ పథకాలకి పెద్దపీట వేస్తున్నాయి. పెద్దఎత్తున ఓటు వేయటానికి పోలింగ్ బూత్‌లకి వచ్చే మహిళలు, పేదలు, యువత లక్ష్యంగా రాజకీయ పార్టీలు వరాల జల్లు కురిపిస్తున్నాయి.
దేశంలో ఎక్కడ, ఏ ఎన్నిక జరిగినా రాజకీయ పార్టీలు మహిళా ఓట్లే లక్ష్యంగా మ్యా నిఫెస్టోలో హామీలు గుప్పిస్తున్నాయి. ప్రస్తు తం దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల శా సనసభ ఎన్నికలలో కూడా రాజకీయ పార్టీ లు పోటీపడి తమ ఎన్నికల మ్యానిఫెస్టోల లో మహిళా ఓట్లను, యువ ఓటర్లను తమ వైపునకు తిప్పుకోవటానికి అనేక హామీలను ప్రకటించాయి.
నగదు పథకాలు గెలుపు కోసమేనా!
లక్ పత్ దీదీ లాంటి పథకాలతో మహిళలను లక్షాధికారులను చేస్తామని కేంద్ర ప్రభుత్వం, అనేక రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ లాంటి రాష్ట్రాలు మహిళలను అదానీ,- అంబానీలలాగా కోటీశ్వరులను చేస్తామనే వాగ్దానాలు చేస్తున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు మహిళల ఖాతాలో నగదు జమ చేసే పథకాలను ప్రకటించి మహిళా ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రారంభించిన మహిళలకి నగదు బదిలీ పథకం ప్రస్తు తం జరుగుతున్న ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో కూడా రాజకీయ పార్టీల ప్రధాన హామీగా మారిపోయింది. మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో లాడ్లీ బెహన్, మహారాష్ట్ర ఎన్నికలలో లడ్కి బెహన్, జార్ఖండ్ ఎన్నికలలో సీఎం మయ్య యోజన,
కర్ణాటక ఎన్నికలలో గృహలక్ష్మి, తెలంగాణ శాసనసభ ఎన్నికలలో మహాలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో తల్లికి వందనం, బీహార్‌లో జీవిక దీదీ లాంటి పథకాలు ఆయా పార్టీలను ఎన్నికలలో గెలిపించడంలో కీలకపాత్ర పోషించా యి. పశ్చిమ బెంగాల్‌లో లక్ష్మీ బండార్, తమిళనాడులో కలైంజర్ మంగళైర్ ఉరిమై తొగై లాంటి మహిళా పథకాలు ప్రవేశపెట్టడం ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా లోకంలో ఇమేజ్ పెంచుకోగలిగాయి.
ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో కూడా రాజకీయ పార్టీలు మహిళల ఖాతాలలో నెలకి నగదు జమ చేసే పథకాలను పోటీపడి ప్రకటించాయి. తమిళనాడులో డీఎంకే మహిళలకి నెలకు రెండు వేల రూ పాయలు ప్రకటిస్తే అన్నాడీఎంకే రూ.3000 ప్రకటించింది. బీజేపీ కూడా రూ.2 వేలు ప్రకటిస్తే విజయ్ సారథ్యంలోని టీవీకే మరొక అడుగు ముందుకేసి నెలకి రూ. 2500, పెళ్లికూతురుకి 8 గ్రాముల బంగా రం, పట్టు చీర అందజేస్తామని హామీ ఇచ్చి మహిళా ఓటర్లకు గాలం వేస్తున్నారు. కేరళ, అస్సాం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో కూడా అన్ని రాజకీయ పార్టీలు మహిళలకి డీబీటీ పద్ధతిలో నగదు బదిలీ చేసే పథకాలను ప్రకటించాయి.
ఈ వివాదం ఎవరికి కలిసొస్తుందో
2023లోనే పార్లమెంటు ఆమోదం పొం దిన మహిళా బిల్లుని (నారీ శక్తి వందన్ అధినియం) రాజకీయ ప్రయోజనాలను ఆశించే మరొకసారి సవరణ బిల్లు పేరుతో తెరపైకి తెచ్చారనే వాదన దేశవ్యాప్తంగా బలంగా వినిపిస్తోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసినా ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించి ఇంత హడావుడిగా 131వ రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకురావలసిన అవసరం ఏముందని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
బెంగాల్‌లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్‌లు మహిళా ఓటర్ల మద్దతుతోనే ఎన్నికలలో గెలుస్తున్నారు. కాబట్టి ఆ రాష్ట్రాలలోని మ హిళా ఓట్లపై ప్రభావం చూపించడానికి ఇం త హడావుడిగా కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లుకి సవరణలు అనే అంశాన్ని తెరపైకి తెచ్చిందని రాజకీయ వర్గాలలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. బెంగాల్ ఎన్నికలలో అధికార టీఎంసీకి, ప్రతిపక్ష బీజేపీకి మధ్య నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ ఉండటంతో టీఎంసీకి బలమైన మద్దతుదారులైన మహిళా ఓట్లను తమ వైపునకు తిప్పుకొని అనుకూల ఫలితాలు సాధించడమే కాదు,
అధికారం హస్తగతం చేసుకోవాలనేది బీజేపీ ఎత్తుగడగా కనిపిస్తోంది. గతంలో ఆదాయ పన్ను పరిమితిని రూ.12 లక్షల వరకు పెంచి, జీఎస్టీ స్లాబ్‌లలో మార్పులు చేసి, ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించి, లబ్ధి పొందిన విధంగానే మహిళా బిల్లు ఆమోదం పొందినా, వీగిపోయినా రాజకీయంగా లబ్ధి పొందాలనేది ఒక రాజకీయ వ్యూహంగా కనిపించింది.
వాస్తవంగా చట్టసభలలో మహిళలకి 33 శాతం రిజర్వేషన్లని 2034 సాధారణ ఎన్నికల నుంచి అమలు చేస్తామని మహిళా బి ల్లులో ఇదే ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ, 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి ప్రతికూల ఫలితాలు రావడంతో మార్చుకు న్న రాజకీయ వ్యూహాలలో భాగంగా 2029 లోక్‌సభ ఎన్నికలకే మహిళా బిల్లు అమలు చేయాలనే ఎత్తుగడ, మహిళలు ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తున్న క్రమంలో 2029 లోక్‌సభ ఎన్నికలలో గెలుపునకు మహిళా బిల్లు ఒక ప్రచారాస్త్రంగా మారబోతుంది. చట్టసభలలో మహిళలకి 33 శాతం రిజర్వేషన్లు ఒక గేమ్ చేంజర్‌గా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి.
కాబట్టి మహిళా సవరణ బిల్లుని వ్యతిరేకించే సాహసం ఏ రాజకీయ పార్టీ చేయటం లేదు. కానీ, డీలిమిటేషన్ జ రిగి నియోజకవర్గాల సంఖ్య పెరిగితే విపక్షా ల రాజకీయ ఉనికికి ప్రమాదం. కాబట్టి మ హిళా బిల్లు చాటున డీలిమిటేషన్ బిల్లులని ఆమోదింపజేసుకోవాలనే ప్రభుత్వ ఎత్తుగడని పసిగట్టిన విపక్ష పార్టీలు బిల్లుని వ్యతిరే కించి ప్రభుత్వ వ్యూహాన్ని తిప్పికొట్టాయి.
మహిళల ఓట్లను పొందటానికి మహిళలకు రిజర్వేషన్లు, నగదు బదిలీ పథకాలు మాత్రమే కాదు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పం పిణీ లాంటి హామీలు కూడా ఇస్తున్నారు. మహిళల తర్వాత గెలుపోటములను ప్రభావితం చేసే యువతరానికి కూడా రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోలో పెద్దపీట వేస్తున్నాయి. ముఖ్యంగా కోట్లాది ఉద్యోగ అవకా శాలు కల్పిస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామనే కీలకమైన హామీలను గుప్పిస్తున్నాయి. బెంగాల్ యువతకి కోటి ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ, నిరుద్యోగ యువతకి నెలకి రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామనే తమిళనాడులో టీవీకె పార్టీ హామీ ఇచ్చాయి.
రాజకీయ పార్టీలు గెలుపు కోసం నగదు బదిలీ పథకాలు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ భృతి, ఉచిత విద్యుత్తు లాంటి ఆకర్షణీయ పథకాలతో ఆయా వర్గాల ఓట్లను ఆకర్షించి తా త్కాలికంగా విజయం సాధించి అధికారంలో కి వస్తాయేమో కానీ, ఇలాంటి తాత్కాలిక ఉపశమనాలతో లక్ష్యాలను చేరుకోకపోగా పథకాల అమలు భారంగా మారి రాష్ట్రాలు మరింత అప్పుల ఊబిలో కూరుకుపోతాయి. అంతేకాదు, భవిష్యత్ తరాలపై పెను భారం పడే ప్రమాదం లేకపోలేదు. పథకాల రూపకల్పన ఎన్నికలలో విజయం సాధించటానికి రాజకీయ లబ్ధి కోసం కాకుండా ఆయా వర్గాల అభ్యున్నతి కోసం రూపొందిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వ్యాసకర్త సెల్: 9885465877






