ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో భూ దందాలు
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
కొడంగల్, ఆగష్టు 11 (విజయక్రాంతి): దుద్యాల మండలం హకీంపేట గ్రామ చౌరస్తాలో ఇండస్ట్రియల్ క్యారిడర్ పేరుతో జరుగుతున్న భూధందాలకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దుద్యాల మండలంలోని హకీంపేట్, లగచర్ల, పోలేపల్లి గ్రామాలలో ఇండస్ట్రియల్ క్యారిడార్ పేరుతో జరుగుతున్న భూసేకరణ చర్యలకు వ్యతిరేకంగా మంగళవారం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి భూభాధిత రైతులతో కలిసి హకీంపేట చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి మాట్లాడు తూ..హకీంపేట లగచెర్ల పోలేపల్లి గ్రామాల కు చెందిన రైతుల నుండి భూములను బలవంతంగా స్వాధీనం చేసుకుని ఇండస్ట్రీయల్ కారిడార్ పేరుతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయల భూములన రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతుందని అన్నారు. రైతుల నుండి తీసుకున్న భూములకు పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించకుండా కాంగ్రెస్ పార్టీ నా యకులు అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
10 ఎకరాలు ఉన్న రైతుకు రెండు ఎకరాలకు పరిహారం అందించి మిగతా డబ్బులు కాంగ్రెస్ నాయకులు పంచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ పాసు పుస్తకాలు సృష్టించి రైతులకు దక్కాల్సిన డబ్బులను అక్రమంగా దోచుకొని అక్రమ వ్యాపారాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. సొంత నియోజకవర్గం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్పందించి సిబిఐ విజిలెన్స్ ఎంక్వయిరీ చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.






