భారీగా నిషేధిత పత్తి విత్తనాల స్వాధీనం
22.8 కిలోల హెచ్టీ కాటన్ (BG III) విత్తనాలు పట్టివేత కేసు నమోదు
షాద్ నగర్ జూన్ 12 (విజయక్రాంతి): ఫరూఖ్నగర్ మండలం లాల్సింగ్ తండాలో అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత హెచ్టీ కాటన్ (BG-III) పత్తి విత్తనాలను వ్యవసాయ శాఖ అధికారులు, షాద్నగర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 22.8 కిలోల నిషేధిత విత్తనాలను పట్టుకొని కేసు నమోదు చేశారు. జిల్లెడు చౌదరిగూడెం మండల వ్యవసాయ అధికారి (ఎంఏఓ)కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఫరూఖ్నగర్ ఇన్చార్జ్ వ్యవసాయ అధికారి రాజేందర్ రెడ్డి, ఏఈఓ బొడ్డు వినయ్, షాద్నగర్ పోలీస్ సిబ్బంది, పంచాయతీ సభ్యులతో కలిసి లాల్సింగ్ తండాలోని ఓ ఇంటిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల సందర్భంగా పల్త్యావత్ కవిత నివాసంలో ఒక సంచిలో దాచిన 52 సిల్వర్ కలర్ ప్యాకెట్లలో సుమారు 22.8 కిలోల నిషేధిత పత్తి విత్తనాలు లభ్యమయ్యాయి. ప్యాకెట్లపై కంపెనీ పేరు లేదా విత్తనాల వివరాలు లేకపోవడం గమనార్హం. విత్తనాల గురించి విచారించగా, కొందుర్గ్ మండలం పాత అగిర్యాల గ్రామానికి చెందిన రాజేశ్వరి అనే మహిళ తన ఇంట్లో ఈ విత్తనాలను దాచమని చెప్పిందని, కొంత డబ్బు వస్తుందనే ఆశతో వాటిని నిల్వ ఉంచినట్లు నిందితురాలు మండల వ్యవసాయ అధికారి ఎదుట వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. అధికారులు ఘటనా స్థలంలోనే సీజ్ పంచనామా నిర్వహించి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
ల్యాబ్ పరీక్షల కోసం నమూనాలను సేకరించి, మిగిలిన విత్తనాలను షాద్నగర్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. ఇలాంటి నిషేధిత, నకిలీ విత్తనాల వినియోగం రైతులకు, పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఉందని వ్యవసాయ అధికారులు హెచ్చరించారు. ఫరూఖ్నగర్ ఇన్చార్జ్ వ్యవసాయ అధికారి ఫిర్యాదు మేరకు షాద్నగర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నం. 490/2026 కింద వివిధ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిషేధిత విత్తనాల విక్రయం, నిల్వపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.






