11 May, 2026 | 1:22 AM

కడ్తాల్ టోల్‌ప్లాజా వద్ద భారీగా నల్లబెల్లం స్వాధీనం

11-05-2026 12:31 AM

ఎక్సైజ్ అధికారుల మెరుపు దాడి

ఆమనగల్లు, మే 10 (విజయక్రాంతి): రాష్ట్రంలో అక్రమంగా తరలిస్తున్న సారా తయారీ ముడి పదార్థాలపై ఎక్సైజ్ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఆమనగల్లు సమీపంలోని కడ్తాల్ టోల్ ప్లాజా వద్ద నిర్వహించిన ముమ్మర తనిఖీల్లో భారీ మొత్తంలో నల్లబెల్లం, పటిక పట్టుబడ్డాయి. హైదరాబాద్ నుండి వివిధ గ్రామాలకు సారా తయారీ కోసం ముడి పదార్థాలు తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో ఎక్సైజ్ అధికారులు నిఘా పెట్టారు.

ఈ క్రమంలో ఆదివారం కడ్తాల్ టోల్ ప్లాజా వద్ద అనుమానాస్పదంగా వస్తున్న ఒక కారును ఆపి తనిఖీ చేయగా, అందులో అక్రమంగా తరలిస్తున్న నిల్వలు బయటపడ్డాయి.నల్లబెల్లం  750 కిలోలు, పటిక80 కిలోలు, రవాణాకు ఉపయోగించిన ఒక కారు నిందితుల వద్ద నుంచి రెండు సెల్ఫోన్లు ఎక్సైజ్ సీఐ బద్యనాథ్ చౌహన్ మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి గ్రామాల్లోని సారా బట్టీలకు వీటిని తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించినట్లు ఆయన వివరించారు.చట్టవిరుద్ధంగా సారా తయారీ చేసినా లేదా ముడి పదార్థాలను రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.