26 August, 2026 | 11:34 AM

ఘనంగా లీగల్ మెట్రాలజీ ‘డే’

21-05-2024 02:49 AM

లీగల్ మెట్రాలజీపై  అవగాహన కార్యక్రమాలు  

తూనికలపై అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 17 (విజయక్రాంతి) : మే 20(సోమవారం)న లీగల్ మెట్రాలజీ దినోత్సవాన్ని పురస్కరించుకొని అధికారులు సోమవారం నగరంలో ని పలు ప్రాంతాల్లో వినియోగదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నిత్యావసర వస్తువులు మొదలుకొని బంగా రం వరకు అన్నింటా తూకాల్లో మోసాలు జరుగుతున్నాయని, వ్యాపారుల అత్యశ, ప్రజల్లో అవగాహన లేమి, అధికారుల ఉదాసీనత వెరసి తూనికలు కొలతల మోసాలు నిత్యం పెరిగిపోతున్నాయని అధికారులు వివరించారు.

వినియోగదారుల అలసత్వమే వ్యాపారులకు అవకాశంగా మారుతోందని అధికారులు పేర్కొన్నారు. దీంతో లీగల్ మెట్రాలజీ విభాగం అధికారులు ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ తూకా ల్లో చేసే మోసాలను కట్టడి చేస్తున్నామన్నా రు.  వినియోగదారులు సైతం తూనికలు కొలతల్లో ఏమైనా వ్యత్యాసం కనిపిస్తే వెంటనే దుకాణదారులను ప్రశ్నించాలన్నారు.

వారు సరైన సమాధానాలు ఇవ్వ కుండా, వినియోగదారులను ఇబ్బంది పెడితే తూనికలు కొలతల అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. తూకాల్లో మోసం జరిగినట్లు తేలితే చట్టపరంగా పోరాడే అవకాశం ఉందని తెలిపారు. సంబంధిత ఆధారాలతో జిల్లా వినియోగదారుల ఫోరాన్ని సంప్రదిస్తే విచారణ జరిపి బాధ్యుల నుంచి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. మోసం జరిగినట్టు గుర్తిస్తే www.clm ఈమెయిల్ ఐడీ  లేదా  7330774444 నంబరు ద్వారా తూనికలు కొలతల అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. 

తూనికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు   

* ఆహార ఉత్పత్తులు, వస్తు సామాగ్రి పరిమాణంపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి.

* ఏ వస్తువును కొనుగోలు చేసినా తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి.

* గ్యాస్ సిలిండర్ తీసుకునే సమయంలో డెలివరీ బాయ్‌కు డబ్బులు చెల్లిస్తాం. అయితే గ్యాస్ డెలివరీ వాహనాల్లో తూకం యంత్రం తప్పనిసరిగా ఉండాలనే నిబంధన గురించి మనలో చాలా మందికి తెలియదు.అనుమానం ఉంటే సిలిండర్ బరువు నిర్ధారించిన తర్వాతే సిలిండర్‌ను తీసుకోవాలి. సిలిండర్‌పై నికర బరువు, గ్యాస్ పరిణామం ముద్రిస్తారు. అవి సరిగా ఉన్నాయో? లేదో? సరిచూసుకోవాలి.

అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం

తూకంలో మోసాలను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, వాణిజ్య సంస్థలు వినియోగించే తూకం యంత్రాలను తనిఖీ చేస్తున్నాం. నిబంధనలు పాటించని వారికి జరిమానా విధిస్తున్నాం. ఈ విషయంపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నాం. వినియోగదారులు మోసపోకుండా పలు రకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఎవరైనా వినియోగదారులు తూనికలు కొలతల్లో మోసాలను గుర్తిస్తే వెంటనే లీగల్ మెట్రాలజీ అధికారులను సంప్రదించాలి.  

 సిద్దార్థ్ కుమార్, లీగల్ మెట్రాలజీ విభాగం అధికారి