26 August, 2026 | 10:35 AM

ఓ వైపు ఎండ.. మరోవైపు వర్షం

21-05-2024 02:50 AM

హైదరాబాద్ సిటీబ్యూరో/వికారాబాద్, మే 20(విజయక్రాంతి) :  నగరంలో ఓవైపు ఎండలు దంచి కొడుతుండగా.. మరోవైపు  ఓ మోస్తారు వర్షం కురిసింది. సోమవారం నగరంలోని పలుచోట్ల నమోదైన వర్షాపాతం వివరాలు పరిశీలిస్తే.. అత్యధికంగా నాంపల్లిలో 16.5 మి.మీ వర్షాపాతం నమోదు కాగా, అత్యల్పంగా ఖైరతాబాద్, ఉప్పల్‌లో 2.3 మి.మీ నమోదైంది. ఆసిఫ్‌ఘర్‌లో 14.3, బండ్లగూడలో 13.3, హయత్‌నగర్‌లో 12.0, బాలానగర్‌లో 8.8, గోషామహల్‌లో 8.4, సరూర్‌నగర్‌లో 7.3, జూబ్లీహిల్స్‌లో 6.8, కార్వాన్‌లో 5.5, చార్మినార్‌లో 4.2, హిమాయత్‌నగర్‌లో 2.5 వర్షాపాతం నమోదైంది. దీంతో రోడ్లపై, కాలనీలలో నీళ్లు నిలవడంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

పిడుగు పాటుకు మరో వ్యక్తి మృతి

యాలాల మండలంలో పిడుగు పాటుకు ముగ్గురు మృతి చెందిన ఘటన మరువక ముందే సోమవారం తాండూరు మున్సిపల్ పరిధిలో మరో వ్యక్తి బలయ్యాడు. పాత తాండూరుకు చెందిన పూరి శేఖర్(40) పట్టణంలో కిరాణ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం సాయంత్రం పని నిమిత్తం బయటకు వెళ్లగా వర్షం కురియడంతో చెట్టుకింద నిల్చున్నాడు. అదే సమయంలో పక్కనే క్రికెట్ ఆడుతున్న ఓ బాలుడు కూడా చెట్టుకిందకు వచ్చాడు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడి చెట్టు కూలిపోయింది. చెట్టుకింద ఉన్న శేఖర్‌పై చెట్టు పడటంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందగా, బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.