15 July, 2026 | 3:06 PM

భవిష్యత్తులో ఏఐ హబ్‌గా హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు

15-07-2026 03:06 PM

రంగారెడ్డి: భవిష్యత్తులో ఏఐ హబ్ గా హైదరాబాద్ మారుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar babu) స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్(Amazon Data Center)కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... అమెజాన్ డేటా సెంటర్ ప్రతినిధులకు స్వాగతం పలికారు. 2047 విజన్ ఆధారంగా పనిచేస్తున్నామని సూచించారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యానికి చేరుకుంటామని చెప్పారు.

రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం పరుగులో తీస్తోందని వివరించారు. పారిశ్రామికవేత్తలకు అన్నిరకాల సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తున్నామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. అమెజాన్ డేటా సెంటర్ కోరిన వెంటనే భూమి కేటాయించామని వెల్లడించారు. అమెజాన్ డేటా సెంటర్ కు అనేక ప్రోత్సాహకాలు కల్పిస్తున్నామని, ఎక్స్ క్లూజివ్ డేటా సెంటర్ పార్క్ కు ఈ ప్రాంతం అనుకూలం అన్నారు. భూమి, నీరు, విద్యుత్, ఇతర వసతులు అందుబాటులో ఉన్నాయని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. డేటా సెంటర్లకు కావాల్సిన విద్యుత్ , నీరు మనవద్ద పుష్కలంగా ఉన్నాయని  వివరించారు.