15 July, 2026 | 3:05 PM

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే ‘భూభారతి’ రీ సర్వే

15-07-2026 03:05 PM

- గంభీరావుపేట గ్రామసభలో సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు 

గంభీరావుపేట,(విజయక్రాంతి): భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘భూభారతి’ రీ సర్వే కార్యక్రమం అమలు అవుతోందని సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు తెలిపారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ మల్లు గారి పద్మ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అయన మాట్లాడారు. శ్రీనివాసపురం రెవెన్యూ శివారు భూముల రీ సర్వే ప్రక్రియలో భాగంగా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నూతన భూభారతి చట్టం ద్వారా ప్రతి భూభాగానికి ఖచ్చితమైన సరిహద్దులు నిర్ధారించి వివాదాలకు ముగింపు పలుకుతామని చెప్పారు. అధునాతన సాంకేతికత, డ్రోన్ల సహాయంతో చేపట్టే డిజిటల్ రీ సర్వే ద్వారా భూముల వివరాలు ఖచ్చితంగా నమోదు అవుతాయని, ప్రతి భూమికి జీపీఎస్ ఆధారిత ల్యాండ్ మ్యాప్‌తో పాటు ప్రత్యేక యూనిక్ ఐడీ కేటాయిస్తామని వివరించారు. దీని ద్వారా రైతులకు పారదర్శకతతో పాటు భూ హక్కుల రక్షణ కలుగుతుందని తెలిపారు.