చిరుత సంచారం.. ప్రజల ఆందోళన
- ప్రత్యేక బోనం ఏర్పాటు చేసేందుకు ఫారెస్ట్ అధికారుల పర్యవేక్షణ
- ఇప్పటికే మేక పై చిరుత దాడి..పంచనామా చేసిన ఫారెస్ట్ అధికారులు
- తనిఖీలు చేపడుతున్నాం.. బోన్ ఏర్పాటు చేస్తాం : రాజశేఖర్, ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్
కోయిలకొండ (విజయక్రాంతి) : గత వారం రోజుల నుంచి కోయిలకొండ ఎమ్మార్వో ఆఫీస్ వెనుక(Behind Koilkonda MRO Office) భాగం ఉన్న గుట్టపై చిరుత సంచారం చేస్తూ ప్రజలకు కనిపిస్తుందని కోయిలకొండవాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం చిరుత పులి మేకపై దాడి చేసి చంపింది. ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలియజేయగా ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాజశేఖర్(Forest Deputy Range Officer Rajasekhar) మేకపై దాడి చేసిన సంఘటనను పంచనామా చేసి సంబంధిత అధికారులకు నివేదిక అందజేశారు.
కోయిలకొండ మండలం ఎమ్మార్వో ఆఫీస్ వెనుక భాగంలో ఉన్న గుట్టపై సంబంధిత ఫారెస్ట్ అధికారులతో, మండల ప్రజలతో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ మండల కేంద్రానికి సమీపంలో ఉన్న గుట్టపై చిరుత సంచారం చేస్తున్నట్లు స్థానికులు చెప్పారు. ఇందులో భాగంగానే ఒక మేకపై దాడి చేసింది పంచనామా కూడా పూర్తి చేశాం. బోనం ఏర్పాటు చేసేందుకు కూడా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. గుట్ట కొంత పైభాగం వరకు కూడా ఇండ్లు ఉండడంతో బోనును ఎక్కడ ఏర్పాటు చేయాలని అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరో రెండు రోజులు పర్యవేక్షణ చేస్తామని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చిరుత సంచారాన్ని నిలుపుదల చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ పరిశీలనలో ఫారెస్ట్ అధికారులు ప్రజలు ఉన్నారు.






