కుష్టు వ్యాధి అనుమానితుల పేర్లు నమోదు చేసుకోవాలి
సర్వే పరిశీలనలో డి.ఎల్.ఓ డాక్టర్ గజానన్
ఆదిలాబాద్,(విజయక్రాంతి): కుష్టు వ్యాధి అనుమానితులను ఎక్కువ సంఖ్యలో గుర్తించి పేరు నమోదు చేసుకోవాలని జిల్లా కుష్టు నివారణ అధికారి డాక్టర్ గజానన్ సూచించారు. కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమంలో భాగంగా ఈనెల 2వ తేదీ నుండి చేపట్టిన సర్వే కొనసాగింపులో భాగంగా ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలోని పలు కాలనీల్లో సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. సర్వేలో భాగంగా కుటుంబ సభ్యులందరిని తప్పనిసరిగా పరీక్షించాలని ఆశా కార్యకర్తలను ఆదేశించారు. అనుమానితులను తమ తమ పి.హెచ్.సి ల కు రిఫర్ చేయాలని సూచించారు. 2027 సంవత్సరం కల్లా భారతదేశాన్ని కుష్టురహిత దేశంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. అందులో భాగంగానే ఇంటింటా నిర్వహిస్తున్న, ఈ సర్వేలో అధికంగా కుష్టు రోగులను గుర్తించేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ పారా మెడికల్ అధికారులు వామన్ రావు, రమేష్, సి.వో లు రణిత, నవీన్, ఏఎన్ఎం లు హరిత, లత, ఆశా వర్కర్లు అర్చన, లక్ష్మీ, స్వరూప తదితరులు పాల్గొన్నారు.






