బంగారు గనిగా మారిన పాలేరు వాగు ఇసుక
వాగులో జోరుగా ఇసుక దందా పట్టించుకోని అధికారులు
పగలు రాత్రి తేడా లేకుండా జాతరలా తలపిస్తున్న పాలేరు వాగు
మొగలాయి కోట గ్రామ సరిహద్దులో కొనసాగుతున్న ఇసుక దందా
అనంతగిరి,(విజయక్రాంతి): పాలేరు వాగు సరిహద్దులో ఉన్న గ్రామాలైన మొగాలైకోట, పాలారం, చనుపల్లి గ్రామాల అక్రమ దారులు ఇసుక రవాణా యదేచ్ఛగా సాగుతున్న పట్టించుకునే వారే కరువయ్యారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ కార్యాలయం నుండి ఎలాంటి అనుమతి లేకుండా గత కొద్ది రోజులుగా గ్రామంలో జోరుగా ఇసుక రవాణా జరుగుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత కొద్దిరోజుల వర్షాల ఉధృతికి పాలేరు వాగులో ఇసుక మేటలు వేసి బంగారు గనులుగా మారింది. దీనిని ఆసరాగా చేసుకొని ఇసుక దళారులు ప్రభుత్వ అధికారుల నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ఆర్జనకు సిద్ధమయ్యారు. కొంతమంది ఇసుక దళారులు రాత్రి పగలు తేడా లేకుండా జోరుగా ఇసుక రవాణా చేసుకుంటూ డబ్బులు దండుకుంటున్నారు.
ఆదివారం సైతం ఇసుక రవాణా చేస్తూ డబ్బులు గడిస్తున్నారు. అక్రమ తవ్వకాల వల్ల కాలువలు వాగులు వ్యవసాయ పొలాలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ ఇసుక 6 వేల వరకు విక్రయిస్తున్నట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా మూలంగా భూగర్భజలాలు అడుగంటి బోరు బావుల్లో నీటిమట్టం పడిపోతుందని రైతులు వాపోతున్నారు. గత కొన్ని రోజుల క్రితం మండలంలోని కొత్తగూడెం గ్రామంలో సైతం ఇసుక అక్రమ రవాణా కొనసాగిన నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశంతో పూర్తిస్థాయిలో కట్టడి చేశారు. అదే తరహాలో మొగలాయి కోట, పాలారం చనుపల్లి గ్రామంలో సైతం ఇసుక రవాణాను పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వెయ్యాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తహసీల్దార్ వివరణ
మండల రెవిన్యూ అధికారిని సంప్రదించగా అందుబాటులో ఉన్న రెవెన్యూ అధికారులను మొగాలైకోట గ్రామంలో ఇసుక తరలిస్తున్న ఘటన స్థలానికి వెళ్లి ట్రాక్టర్లను సీజ్ చేయమని ఆదేశాలిచ్చారు. అక్రమ ఇసుక రవాణా జరిపితే ఎలాంటి వారినైనా ఉపేక్షించేదిలేదు అన్నారు.






