02-12-2025 10:55:37 PM
మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పిలుపు..
ముషీరాబాద్ (విజయక్రాంతి): వర్తమాన భారతదేశ ఆర్థిక సామాజిక అంతరాలతో కూడుకొని ఉన్నదని, ఈ అంతరాలు ప్రజల మధ్య ఐక్యతకు విఘాతంగా ఉన్నాయని, ఈ అంతరాలను తగ్గించుటకై అభ్యుదయ శక్తులు ఏకం కావాలని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని దొడ్డి కొమురయ్య హాల్లో టీఎస్ యుటిఎఫ్ సీనియర్ నాయకులు అక్షయకుమార్ దత్తు ద్వితీయ వర్ధంతి సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి స్మారకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా దత్తు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం నర్సిరెడ్డి మాట్లాడుతూ దేశంలో స్వాతంత్రం వచ్చేనాటికి ఆహార కొరత, సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో సమాజంలో వెనుకబాటుతనం ఉండేదన్నారు. విద్యారంగం అందరికీ అందుబాటు లేకపోవడంతో కూడా వెనుకబాటుకు కారణంగా ఆనాడు పాలకులు భావించారన్నారు. ఈ విధానాలను రూపుమాపడం ద్వారా భారత దేశంలో సామాజిక ఐక్యతను సాధించగలమని, అందుకోసం నిరంతరం తపించిన ఎమ్మెల్యే దత్తు ఆశయాల సాధన కోసం కార్యకర్తలందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర అధ్యక్షులు చావ రవి, కార్యదర్శి ఎ. వెంకట్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కోసం నిరంతరం పోరాటాలు చేయాల్సిందేనని జాతీయస్థాయిలో ఎనీ పి ట్వంటీ ట్వంటీ ద్వారా విద్యారంగాన్ని కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తుందని అన్నారు. ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్, ఐద్వా నాయకులు టి. జ్యోతి, టిఎస్ యుటిఎఫ్ సీనియర్ నాయకులు సంయుక్త, నరహరి, మస్తాన్ రావు, రాష్ట్ర కార్యదర్శులు సింహాచలం, వెంకటప్ప, పౌరస్పందన వేదిక ప్రధాన కార్యదర్శి రాధేశ్యాం, పద్మశ్రీ, దత్ భార్య లలితమ్మ, కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, పలు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.