11 July, 2026 | 4:01 AM

బాలకార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలిద్దాం

11-07-2026 02:04 AM

ఆపరేషన్ ముస్కాన్ XIIలో పది రోజుల్లో 34 మంది చిన్నారుల రక్షణ

జిల్లా వ్యాప్తంగా 22 కేసుల నమోదు

అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్

మెదక్, జులై 10 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా జూలై 1 నుంచి చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్‌ XII కార్యక్రమం మెదక్ జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా కొనసాగుతోందని, బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించేందుకు ప్రతి శాఖ సమిష్టిగా కృషి చేయాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ పిలుపునిచ్చారు.

శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన వివిధ శాఖల సమన్వయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని హోటళ్లు, ఇటుక బట్టీలు, నిర్మాణ పనులు, వ్యాపార సముదాయాలు తదితర ప్రాంతాల్లో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి వెంటనే రక్షించి, చైల్ వెల్ఫేర్ కమిటీ (CWC) ముందు హాజరుపరిచి, అనంతరం తల్లిదండ్రులకు లేదా అవసరమైతే సంరక్షణ గృహాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పిల్లల బాల్యం విద్యకే అంకితం కావాలని, వారి భవిష్యత్తు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని, బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన అన్నారు. పిల్లల చేతుల్లో పనిముట్లు కాకుండా పుస్తకాలు ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, జిల్లా ప్రజల సహకారంతోనే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ఆపరేషన్ ముస్కాన్‌XII ప్రారంభమైనప్పటి నుంచి పది రోజుల వ్యవధిలో జిల్లాలో 34 మంది చిన్నారులను రక్షించి, చైల్ వెల్ఫేర్ కమిటీ (CWC) ముందు హాజరుపరిచిన అనంతరం వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి అప్పగించినట్లు తెలిపారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 22 కేసులు నమోదు చేసినట్లు పేర్కొంటూ, బాల కార్మికులను పనిలో ఉంచుకునే యజమానులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ ప్రత్యేక కార్యక్రమం నెల రోజుల పాటు కొనసాగనున్న నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో ప్రతిరోజూ మండలాలు, గ్రామాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి బాల కార్మికులను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ జార్జ్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సతేంద్ర ప్రసాద్, విద్యాశాఖ, కార్మికశాఖ అధికారులు, ఎన్జీఓ ప్రతినిధులు, అలాగే రెండు డివిజన్లకు చెందిన ఆపరేషన్ ముస్కాన్ బృందాలు పాల్గొన్నారు.