6 June, 2026 | 3:04 AM

భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

06-06-2026 01:14 AM

వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్

హనుమకొండ, జూన్ 05 (విజయక్రాంతి): భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, కాలుష్య రహిత పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్  సన్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు.

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ అధికారులు, సిబ్బందితో కలిసి పండ్ల మొక్కలను నాటారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అటవీ సంపద క్రమంగా తగ్గిపోతుండటం, పచ్చదనం స్థానంలో కాంక్రీట్ నిర్మాణాలు పెరుగుతుండటం, వాహనాలు, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వెలువడుతున్న కాలుష్యం కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందన్నారు. దీనివల్ల వాతావరణ పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని, సమయానికి వర్షాలు కురవకపోవడం, అధిక ఉష్ణోగ్రతలు నమోదవడం వంటి పరిణామాలు ప్రజల జీవన విధానంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు.

ఈ పరిస్థితులకు ప్రధాన కారణం పచ్చదనం తగ్గిపోవడమేనని పేర్కొన్న ఆయన, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. విస్తృత స్థాయిలో మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం ద్వారా రాబోయే తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు అంకిత్ కుమార్, దారా కవిత, అదనపు డీసీపీలు  రవి, సురేష్ కుమార్, శ్రీనివాస్, ఏసీపీలు నర్సింహారావు, నాగయ్య, అంతయ్య, సురేంద్ర, ఆర్‌ఐలు  సతీష్, శ్రీనివాస్, చంద్రశేఖర్, శ్రీధర్తో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.