calender_icon.png 5 August, 2025 | 11:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండెలోతు భాషతనానికి గర్విద్దాం!

12-08-2024 12:00:00 AM

మన తెలంగాణ పదాలు, మాటలు, పాటలు, ముచ్చట్లు కనుమరుగవకుండా భావితరాలకు అందించడానికి పాఠ్యపుస్తకాలలో చేర్చి మన భాషను సజీవంగా ఉంచడం మనందరి ధర్మం, కర్తవ్యమూను. 

తెలంగాణ అంటేనే ప్రకృతితో అనుసంధానమైన  జీవన విధానం (శైలి). భాష సహజ క్రియతో కూడుకున్నది. సహజసిద్ధంగా, సమాసా లు, దీర్ఘాలు లేకుండా హృదయంతో అతుక్కున్నట్టు ఉంటుంది. జున్ను పాలవలె రుచిగా, కమ్మగా, బర్రెపట్టు పాలవలె పుష్టిగా, మనసు పులకింపుగా ఉంటుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, విమర్శకులు విమర్శించినా మనది కమనీయమైన, గమ్మత్తయిన ఆత్మీయ భాష.

ప్రతి మాట, పదం అన్నీ నాభిలోంచే వస్తాయి. ఏ పదం, ఏ మాటా కేవలం నాలిక మీదుగా రాదు. మానవ సంబంధాల విషయంలో ‘అయ్యా, అవ్వ, బాపు, అమ్మ, చిన్నాయనా, కాకా, చిన్నాన్న చిన్నమ్మ, నాయనమ్మ, అమ్మమ్మ.. కొన్ని ఉదాహరణలు. ఇక పిలుపుల విషయంలో మగవాళ్ళను ‘రావే పోవే’ అని, అట్లనే ఆడవాళ్లను కూడా ‘ఏందిరా’ అని సంభోదిస్తారు. ‘పోరడు’, ‘పోరగాడు’, ‘పోల్లగాడు’, ‘పిల్ల’, ‘పోరి’, ‘పొల్ల’.. ఇవి తెలంగాణ జాతిలో ఇమిడిపోయిన పదాలు.

ఈ పిలుపులు ఎంతో ఆత్మీయత, ఆనందంతోపాటు గౌరవంగా కూడ ఉంటాయనడంలో సందేహం లేదు. ఇంటికి వచ్చిన చుట్టాన్ని అన్నం తినందె పంపియ్యరు. ‘చెయ్యి కడిగిపో లేవే, చెయ్యి కడిగి పోవు’ అని ఆత్మీయతతో చెపుతారు. ‘కడుపు సల్ల పడిపో’ అని అభిమానంతో అదరిస్తారు. వయసు మళ్ళిన పెళ్ళాం మొగలు ‘మా ముసలాయన’, ‘మా ముసలమ్మ’ అని చెప్పుకుంటూ ఒకరినొకరు మురిసిపోతారు. ‘ముసలొల్ల మాట సద్దుల మూట’ అని గౌరవిస్తారు.

మహిళలు వివిధ పండుగలప్పుడు అందరూ కలిసి   గుంపులు గుంపులుగా ఒకరి ఇంటికి ఒకరు వెళ్తారు. ఇంటికి పసుపు కుంకుమలకు రమ్మని ఆనందంతో పిలుస్తారు. ‘ఇచ్చుకుంటి వాయినం పుచ్చుకుంటి వాయినం’ అని ఆయా పండుగలప్పుడు ఒకరికి ఒకరు సంతోషంతో ఇచ్చి పుచ్చుకుంటారు. చెంపలకు పసుపు రాసుకుంటూ, నుదుట కుంకుమబొట్టు పెట్టుకుంటూ, పట్టుచీరలతో మెడలో నగలు ధరించి మురిసిపోతారు. పండుగలు ఉన్నంతలో చాలా ఘనంగా జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మీయమైన పండుగ. ఎక్కడ ఉన్నా ఆడబిడ్డలు తమ  తల్లిదండ్రుల ఇండ్లలకు, అన్నదమ్ముల ఇళ్లకు పోవడం ఈ పండుగ విశిష్టత. తెలంగాణలో ఎక్కువ పండుగలు ఆడబిడ్డలవే.

మా చిన్నప్పుడు మా కొలనూరులో వివిధ పండుగలప్పుడు ప్రత్యేకంగా శ్రావణమాసంలో వేములవాడ, ధర్మపురి మొదలైన గుళ్లకు వెళ్లి వచ్చిన తర్వాత కొబ్బరికాయ పలహారం ఆయా దేవుని ప్రసాదాలతో బజార్లోకి వచ్చి పంచి పెట్టేవారు. ‘రాజేశ్వరుని పలహారం, పోచమ్మ పలారం ఊళ్ళో’ అంటూ అందరికీ ఇచ్చేవారు. దేవుళ్ల దయ, ప్రసాదం  అందరికీ అందాలని తెలంగాణ వాసులు కోరుకుంటారు. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం, సంస్కారం కూడ. ఏదైనా పది మందికి పంచి పెట్టే గుణం తెలంగాణ విశిష్టత.

ఇక, ఆటలూ సహజత్వంతోనే ఉంటాయి. సిర్రగొనే,  దబ్బెడ దిబ్బెడ, కబడ్డీ మొదలైన ఆటలు మన తెలంగాణ సంప్రదాయ వారసత్వం. ఏ అటలోనైనా ఎగరడం, దుంకడం ఉంటుంది. ‘సాహితి గాళ్ళు, సోపతి గాళ్లు ఎగరటానికి, దుంకటానికి పోయిండ్రు’ అని చెపుతుంటారు. మనిషి నడవకుండా పోవడాన్ని ఉరకడం అంటారు. ‘ఉరికిపో’, ‘ఉరికిరా’ పదాలు చర్యలతో, క్రియలతో సహజంగా ఉంటాయి. ఇగ్డం, ఇగ్టం, గుంజు, గుంజడం లాంటి పదాలు సహజంగానే నోళ్లలో ఆయా పనులనుబట్టి వస్తాయి.

ఏ పని చేసినా, ఎటువంటి ప్రయాణంలోనైనా మనసులో పాటలు పాడడం తెలంగాణ సంస్కృతి. ఈ పాటలు కూడా సదరు పని, ప్రయాణానికి తగ్గట్టు ఉంటాయి. శరీరానికి అలసట కలగకుండా పాటలు పాడుకుంటూ పనులు, ప్రయాణాలు జరుపుతారు. ఇంకా మంచినీళ్లు తాగడాన్ని ‘దుపా’, ‘దప్పి’ అంటారు. అన్నం తినడాన్ని ‘బుక్కెడు బుక్కి నావే’, ‘బుక్కెడు బుక్కుపో’, ‘బుక్కెడు మింగు’ అంటారు. అన్నంలో తొక్కు నంచుకొనటానికి కారం పొడి లేనిదే ముద్ద నోట్లోకి దిగదు. ఇట్లా, ప్రతి చర్య సహజాతంతో కూడుకొని ఉంటుంది.

చాలా కొలతలు ఈతరానికి తెలియవు. బెత్తెడు జానెడు, గజం, ఇసమెత్తు, టంకమెత్తు, పావుసేరు, సవశేరు, అరశేరు, అరతక్కెడ, తక్కెడ, అరసోడు, సోడు, తవ్వెడు, మానెడు, అడ్డెడు, కుంచాలు, ఇరుసులు, తూములు, పుట్టెడు.. వీటిని జాగాలు, వస్తువులను ధాన్యాలను లెక్క పెట్టుటకు ఉపయోగిస్తారు. ఏ కొలత మొదలుపెట్టినా ‘లాభం’ అని మొదలుపెడతారు.

అట్లనే రంగులు పసుపురంగు, ఎర్ర, బీరపువ్వు  గుమ్మడి పువ్వు రంగులు ఎర్రమట్టితో ఇండ్ల గోడలకు రంగులు వేసేవారు. దీనిని ‘జాజు రంగు’ అంటారు. ఇట్లా ప్రకృతి ప్రసాదించిన రంగులతో పోలుస్తూ జీవన విధానం ఉంటుంది.

మన తెలంగాణ మాటలు, పదాలు, కొలతలు, రంగులు, తినడం, తాగడం అన్నీకూడా చేసే పనికి  దగ్గరగా సహజత్వంతో కూడుకుని ఉంటాయి. ఇది ఇట్లా ఉంటే, కొందరు మన తెలంగాణ వాళ్లే మేము హైదరాబాద్ వాసులం, మాది హైదరాబాద్ భాష,  మాది ప్రత్యేకమైన వ్యవస్థ అని మురిసి పోతుంటారు. వీళ్ళకు తెలంగాణ భాషతో సంబంధం లేనట్టు, తెలంగాణ ప్రాంతం హైదరాబాదుతో ఎలాంటి సంబంధం లేనట్టు భావిస్తారు. తెలంగాణ భాష తెలుగు అక్షరమాలలోని 56 అక్షరాల నుండి వచ్చినవని వీరు తెలుసుకోలేకపోతున్నారు.  సహజమైన తెలంగాణ భాషలో మాట్లాడడం, మెలగడం వీరు నామోషీగా, చిన్నతనంగా అనుకుంటున్నారు.

హైదరాబాద్ మన తెలంగాణ నడిబొడ్డు, రాజధాని నగరం. నాలుగు దిక్కులు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం.. నాలుగు దిశల అయిన ఈశాన్యం, వాయువ్యం, నైరుతి, ఆగ్నేయం  ఎటు 200 కిలోమీటర్లు చూసినా తెలంగాణ తనం నిండుకున్న ప్రాంతాలు దర్శనమిస్తాయి. అంటే, హైదరాబాద్ తెలంగాణలో ఒక భాగం. ఇక్కడ  ప్రత్యేకమైన భాష, ప్రత్యేక ప్రాంతమనే సమస్యే ఉత్పన్నం కాదు. ఎన్నో సంవత్సరాల తరబడి హైదరాబాదులో ఉంటున్న నాయకులు కూడా మన స్వచ్ఛమైన తెలంగాణ భాషలో మాట్లాడుతున్నారు. ఇంకా ఇతర మేధావులు విద్యావంతులు కూడా హైదరాబాదులో సంవత్సరాలుగా ఉంటున్నా తెలంగాణ భాషను కొనసాగిస్తున్నారు. ఇది  సాన సంభ్రమైన విషయం. మన తెలంగాణ పదాలు, మాటలు, పాటలు, ముచ్చట్లు కను మరుగవకుండా భావితరాలకు అందించడానికి పాఠ్యపుస్తకాలలో చేర్చి మన భాషను సజీవంగా ఉంచడం మనందరి ధర్మం, కర్తవ్యమూను. 

దండంరాజు రాంచందర్‌రావు  

9849592958