calender_icon.png 5 August, 2025 | 9:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పురిటి తోడు

12-08-2024 12:00:00 AM

నెర్రెలౌతున్న నేల నిరీక్షణలోకి మేఘంలా.. దిక్కుతోచని తాయిమాయి గుమ్మంలోకి ఆశదారి పొడలా వాలుతుంది. కొంగుకి భయాలను ముడేసుకుంటున్న చూలాలి దిగులును వడిగా ఓ ‘హామీ’ నిమ్మళ పరుస్తుంది.

అంతదాకా కైవారం గట్టిన పరామర్శలకూ అనుమానాలకూ ఆమె రాక ఓ సమాధానం. కడుపులోని కదలికలను అన్వయించుకున్న అపోహలన్నీ ఆమె చర్యలో చెదిరిపోతాయి. సందేహాల నెగడులో మెలిపెట్టి తేలిపోతున్న నొప్పులన్నీ.. అదిమిన మునిపంటి కిందికి చేరుతాయి. ఓర్పు అడుగంటిన బాధాతప్త దేహాన్ని ఆ చల్లని చేయి తాకితే అదో అంతులేని ఉపశమన. శాంతపరిచే సాంత్వన. సుతారంగా పొత్తికడుపును తడిమి 

నాలుగు ధైర్యవచనాలను మాత్రలుగా వేస్తుంది. కల్వం, కొడువలి, సరంజామాతో వెచ్చాలు సొంటి మోడీ పిప్పళ్ళు కుంకుమపువ్వు వాత విధ్వంసిని చింతామణి మాత్రలూ సైన్యంగా కాన్పు ప్రక్రియకు శ్రీకారం చుడుతుంది.

సుతారంగా పొట్ట కండరాల్ని సవరించి ఆయువు పోసుకున్న శిశువును అమ్మ కడుపు సంచీ నుంచి ఆప్యాయంగా తీస్తుంది. రెపరెపలాడే అమ్మ దీపం ఆరకుండా చేతి నడ్డుపెట్టి వెలగనిస్తుంది. పసికందుని ఎత్తుకున్న తొలి ఒడి ఆమె. చల్లగా బొడ్డుతాడు తెగ్గోసి చంటిపాపకి కంటి రెప్పు కాన్పు కష్టం కాకుండా కదిలి వచ్చిన కనకదుర్గ. బాలింత ఒంటికి నలుగు పెట్టి వావిలాకు నీళ్ళ స్నానమై పసికందుకి దొండాకు పసరు అభ్యంగనమై వ్యాధులను తరిమే ఎల్లమ్మ తల్లి. వైద్యుడు లేని చోట వైద్యం పరమార్థం తెలిసిన ఆపత్కాల చికిత్స. 

ఆమె చేతిలో ఊపిరెత్తుకున్న తల్లులు తల్లులై జన్మ సార్థకమౌతారు. తరం నుంచి తరానికి చాచిన ఆ ఆపన్న హస్తం ప్రతి ప్రసూతికీ చలువ పందిరి. అమ్మతనపు బాధ తెలిసిన వెచ్చని పొత్తిలి మంత్రసానితనపు బాధ్యతలో తను పండిపోయేదాకా పురుళ్ళు చేసిన పుణ్య వారాశి. ప్రసవం ప్రాణ సంకటం కాకుండా పూలు పరిచిన జాలి వెన్నెల జాబిల్లి. తనువెండి పోయేదాకా తల్లులకూ తనయులకూ తల్లైన తల్లి.

(మంగలి ‘గౌరక్క’ యాదిలో.. )

వఝల శివకుమార్

9441883210