calender_icon.png 5 August, 2025 | 1:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భైరవ మహాకవి

12-08-2024 12:00:00 AM

‘మహాపురాణం’లోని కొన్ని ప్రధానాంశాలతో కావ్యాలను, ప్రబంధాలను రచించి, కీర్తిగాంచిన మహాకవులెందరో తెలుగు సాహితీ ప్రపంచంలో మనకు దర్శనమిస్తారు. అటువంటి అరుదైన మహాకవులలో ఒకరు భైరవ కవి. ‘గరుడ పురాణ’ సంబంధిత అంశాల ఆధారంగా తెలుగులో ఒక మహాకావ్య రచన చేశాడు. అదే ‘శ్రీరంగ మహత్త్వము’. ఈ రచనలో ఇక్షాకు మహారాజు, విభీషణుడు మొదలైన వారి కథలను ఆయన పొందుపరిచారు.

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ‘శ్రీరంగము’నకు సంబంధించిన అనేక తీర్థాల మహిమలను వర్ణించాడు. అదికూడా ప్రాబంధిక వర్ణనా రీతిలో, తన కవిత్వ ప్రతిభకు ఒక దర్పణం వలె ఈ గ్రంథాన్ని భైరవ కవి రచించాడు. దీనితోపాటు ‘కవి గజాంకుశము’ పేర ఒక ఛందశ్శాస్త్రం, ‘రత్నపరీక్ష’ పేరున ఓ ప్రత్యేకమైన రత్నశాస్త్రాన్ని ఆయన సృజించాడు. తెలుగులో ‘హరిశ్చంద్రోపాఖ్యా’నాది గ్రంథకర్తయైన సుప్రసిద్ధ మహాకవి గౌరన కవి పుత్రుడే ఈ భైరవ కవి. తండ్రీ కొడుకులు ఇరువురూ మహాకవులే కావడం విశేషం.

మూడు విభిన్న గ్రంథాలు

మూడు విభిన్నమైన ప్రత్యేక గ్రంథాల (శ్రీరంగ మహత్తము, కవి గజాంకుశము, రత్నపరీక్ష)ను వెలువరించిన భైరవ కవి ‘శ్రీరంగ మహత్త’ కావ్యం తొట్ట తొలిసారి వెలుగుచూసింది 1912వ సంవత్సరంలో! దీనిని వెలుగులోకి తెచ్చిన మహనీయుడు మానవల్లి రామకృష్ణ కవి. ఫలితంగా తెలుగు సాహిత్య చరిత్రలో కొత్త వెలుగు ప్రసరించింది. మానవల్లి రామకృష్ణ కవి సుప్రసిద్ధ పరిశోధకులే గాక తెలుగు సాహితీచరిత్రలో నన్నెచోడుని వంటి ఎందరెందరో కవిచంద్రులను వెలికి తీసి, వారి గ్రంథాలను అందించే బృహత్ ప్రయత్నం చేసిన మహామహోపాధ్యాయుడు. 

‘భైరవ కవి’ కాలాన్ని గురించి మానవల్లి వారేగాక ఆరుద్ర, ఆచార్య ఎస్.వి.రామారావు, డా.శ్రీ పెరుంబుదూరు శ్రీరంగాచార్య వంటి పరిశోధక పండితులు అనేక ప్రమాణాలతో క్రీ.శ. 1400 గా నిర్ధారించారు. ‘శ్రీరంగమహత్త్వము’ను  1460 ప్రాంతంలో రచించి ఉండవచ్చునని వారు అభిప్రాయ పడ్డారు. నాటి రాచకొండ రాజులు, వారి సామంతులు, మంత్రుల కాలాన్ని ప్రమాణాలుగా గ్రహించిన తర్వాతే వారు ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ సందర్భంలో మహాకవి భైరవుని తండ్రి గౌరన కాలాన్నీ వారు పరిగణనలోకి తీసుకున్నారు.

భైరవ కవి తన ‘శ్రీరంగ మహత్తము’ కావ్యంలో 

“శబ్దార్థరూఢి, రసస్థితి, బహువిధ 

వ్యంగ్యభేదములు, భావములు, గతులు,

శయ్యలలంకారసరణులు, రీతులు, 

పరిపాకములు, దశ ప్రాణములును

వృత్తులు, వస్తు వివేకంబు, గుణములు, 

గవి సమయము జమత్కారములును

వర్ణనంబులు, గణవర్ణ పదంబులు, 

తత్కులంబులు నధిదైవతములు

గ్రహములు, శత్రుమిత్రయోగములు, దశలు,

వంశవేధయు భూత భీజాక్షరములు,

పొత్తువులు దెల్పి శాంతవిస్ఫురణదనరు

సత్కవీంద్రుని కృతి బుధసభల వెలయు”

అన్నాడు. కవి రచించవలసిన కావ్యం ప్రతిభను వెలిగించాలంటే పై లక్షణాలన్నీ అవసరమని భైరవ కవి చెప్పాడు. ‘కవి గజాంకుశము’ లక్షణగ్రంథంలో కూడా ఇదే పద్ధతిలో చెప్పి ఉండవచ్చు. అయితే, ఇందులోని 78 పద్యాలే ప్రస్తుతం లభ్యమవుతున్నాయి. 

‘కవి గజాంకుశము’ రచించిన కాలంలో ఈ కవి యువకుడై ఉండవచ్చునని ఆరుద్ర భావించారు. ఇందుకు ఈ కింది పద్యాలే ప్రమాణాలు. ‘కవి గజాంకుశము’ ప్రారంభంలో తాను దుష్కర పిశాచాలను అదలించే భైరవుడనని చెప్పుకుంటూ

‘భైరవుడ నుభయ భాషా 

పారీణుడ లోభిభువన భవభూమి వ్యా

పార వికార దుష్కవి

ఘోర  పిశాచుల వదల్చుకొని భైరవుడన్’ 

అన్నాడు. ఇలా చెప్పుకున్నా ఇది తన పేరును సమర్థించుకొనే కారణమై ఉండవచ్చు. కానీ, ఆయన రచనల్లో ఈ భైరవ లక్షణం ఎక్కడా కనిపించదు. పై గ్రంథంలోనే తనను ‘సద్గుణ రత్నాభరణుని’గానూ చెప్పుకున్నాడు. 

మహాకవి గౌరన వారసుడు

భైరవకవి తన తండ్రి గౌరన మార్గాన్నే అనుసరించినట్లు అనిపిస్తుంది. గౌరన ‘హరిశ్చంద్రోపాఖ్యానాన్ని’ రచించక పూర్వం ‘లక్షణ దీపిక’ అనే ఓ లక్షణ గ్రంథం రచించాడు. భైరవ కవి కూడా ‘శ్రీరంగ మహత్త్వము’కన్నా పూర్వమే ‘కవి గజాంకుశము’ (లక్షణ గ్రంథం) సృజించాడు. అందులోని తొలి పద్యాల్లోనే ‘మదించిన కుకవుల మదమణచి వేయుటకై చేతికి అంకుశం తగిలించుకొని కవిమత్తేభాల మదమును అణచివేసే ప్రయత్నం’ చేస్తానన్నాడు.

‘సందడి వడు లక్షణమును పొందు 

గదవళించి జాగుపోవిడచి సుధీ

బృందంబు మెచ్చ, నేనొక చందమ్మున 

కవి గజాంకుశమ్మును పేరన్’

‘లక్షణ గ్రంథమొనరించి లాగుమీర, 

దానిగొనియేను కుకవిమ మాతంగములను

మదమదూలంగ గీపెట్టపాలపు వాడనని 

ప్రతాపించి పలికి పలుకు వినుడు’

అంటూ తన లక్షణగ్రంథ ప్రయోజనాన్ని ఆయన స్పష్టంగా చెప్పాడు.

భైరవ కవి శాస్త్రగ్రంథం ‘రత్న పరీక్ష’. దీనిని వెలువరించే వ్యక్తికి రత్నశాస్త్ర పరిచయం విధిగా ఉండాలి. రత్నముల గురించి ఎంత సాధికారికమైన విషయాలను చెప్పాడో పరిశీలిస్తే ఆయనలోని రత్నశాస్త్ర పాండితీ ప్రకర్ష మనకు అర్థమవుతుంది. ఈ గ్రంథంలో ఒకచోట

‘దాకటి మీదపెట్టి బెడిదంబుగ సమ్మెట వేయ భిన్నమై

పోక, జలంబులో మునిగి పోవక, యెప్పుడు లోహ పత్రికిన్

జేకొని వ్రాయరేఖ విలసిల్లని వజ్రము వజ్ర మిద్ధరిన్

బ్రాకటరీతి దాల్చునట భర్గుడొసంగు శుభంబు లెప్పుడున్’

అన్నాడు. శుద్ధ వజ్రాన్ని, దాని లక్షణాలను చెబుతూనే అటువంటి దానిని ధరించడం సర్వ శ్రేయోదాయకమన్న భావాన్ని వెలిబుచ్చాడు. అంతేగాక, లోపాలున్న వజ్రాన్ని ధరించడం వల్ల మనిషికి ముప్పు వస్తుందని కూడా ప్రకటించాడు.

తెలుగునేలలో వజ్రాలు లభించే ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అందుకే, ఈ గ్రంథంలో ఏయే యుగాల్లో అవి లభించాయో కూడా కవి విపులంగా వివరించాడు. కొన్ని సాంఘిక, రాజకీయ అవసరాల వల్ల ఈ తరహా శాస్త్రగ్రంథాలను ఆయా కాలాల్లో మహాకవులు రచించి ఉండవచ్చునని ఆరుద్ర వంటి పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

మంత్రికి అంకితం

పద్మనాయక రాజుల రాజ్యం బహుమనీ సుల్తానుల పరమైంది. ఆ పిదప రాచకొండ, దేవరకొండ రాజ్యాలలో అనేక మార్పులు వచ్చాయి. అక్కడి మంత్రులు మహమ్మదీయ రాజుల కొలువుల్లో చేరడం సహజంగా జరిగింది. భైరవ కవి ఈ మంత్రులలో ఒకరైన చాగయ రామదేవ పండిత మహాప్రధానికి తన ‘శ్రీరంగమహత్త’ కావ్యాన్ని అంకితం చేశాడు. రాజులు పాల్గొన్న యుద్ధాలలో రామదేవ పాల్గొన్నట్లు ఈ కావ్యం వల్ల తెలుస్తున్నది. షష్ఠ్యంతాలలో చెప్పిన

‘సింహతలాటాంకునకుప

సంహృత కర్ణాట కటక జననాథ చమూ

రంహునకు జారులక్షణ

సంహనునకు నమితభాగ్య సంపన్నునకున్’

అనే పద్యాన్నిబట్టి ఈ గ్రంథాన్ని అంకితం తీసుకున్న రామదేవ పండిత మహాప్రధాని ఆ మహమ్మదీయ రాజుల పక్షాన నాటి కర్ణాటక పాలకులతో పోరాడిన యోధుడేనని స్పష్టమవుతున్నది.

శ్రీనాథ, పోతనాదుల ప్రభావం

పూర్వ రచనల్లో తనను భ్రమరాంబాదేవి భక్తునిగా అభివర్ణించుకున్న భైరవకవి కాలక్రమంలో వైష్ణవధర్మం స్వీకరించినట్టు తెలుస్తున్నది. అలా, సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన ‘శ్రీరంగక్షేత్ర’ ప్రాశస్త్యాన్ని ఎఱుక పరిచే మహాకావ్యంగా ‘శ్రీరంగ మహత్తము’ను తెలుగు సాహిత్య ప్రపంచానికి అందించాడు. శ్రీనాథ పోతనాదుల ప్రభావం ఈ కవిపై బాగా ఉంది. ముఖ్యంగా పోతన పద్యాలవంటి పద్యాలే అధికంగా ఈ కావ్యంలో కనిపిస్తాయి.

‘హరిదివ్య నామధేయామృతం బింపార 

జెలగి యాస్వాదించు జిహ్వజిహ్వ

గోవింద కల్యాణగుణ విశేషంబులు 

బలుమారు తలపోయు తలపు తలపు

కమలాక్షు నిత్యమంగళమూర్తి విభవంబు 

సొంపార వీక్షించు చూపు చూపు

ఫణిరాజతల్పు శ్రీపాద పద్మంబులు 

జేరి యర్చనసేయు సేత సేత

వాసుదేవ ప్రియంబైన వ్రతము వ్రతము

దైత్యభేది నుపాసించు తపము తపము

శౌరి నారాధనము సేయు జపము జపము’

అంటూ చెప్పిన కథారంభంలోని పద్యమే ఇందుకు నిదర్శనం. పోతన రచించిన ‘కమలాక్షునర్చించు కరములు కరములు..’ అన్న పద్యం వెంటనే మనకు గుర్తొస్తుంది. ‘శ్రీరంగ మహత్త్వము’లో కథకన్నా కవి శ్రీరంగక్షేత్ర పవిత్ర ప్రాభవాలకే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చాడనిపిస్తుంది. దీనికి మూలం ‘గరుడ పురాణమే’ అయినా ‘బ్రహ్మాండ పురాణం’లోను కొంత ఆధారం కనిపిస్తుంది. ‘గారుడంలో నూరు అధ్యాయాలున్నాయి. బ్రహ్మాండ పురాణంలో తొమ్మిది మాత్రమే ఉన్నాయి. గరుడ పురాణాన్నే ఆధారం చేసుకొని భైరవుడు దీనిని రచించాడు’ అన్న ఆరుద్ర అభిప్రాయం గమనార్హం. ఈ కావ్యానికి మూలం ఒక్క ‘గరుణ పురాణమే’ కాని బ్రహ్మాండ పురాణం కాకపోయి ఉండవచ్చునన్న భావన కూడా ఒకింత కలుగుతుంది.

వచనంలోనూ అద్భుత ప్రతిభ

వివిధ ఛందఃప్రయోగాలు చేసిన భైరవ కవి తన కావ్యంలో పలు సర్వలఘు పద్యాలుసహా బంధ కవిత్వ పద్యరచనా చేశారు. ఇది ఎంత పటిష్ఠమైందో మనకు అర్థమవుతుంది. ఆయన రచనలోని అనేక పద్యాలను ఎందరో లాక్షణికులు తమ లక్షణగ్రంథాలలో ఉదాహరించడాన్నిబట్టి వాటి ప్రాముఖ్యమూ తెలుస్తుంది. ఆయన రచనకొక ప్రామాణికతగానూ దీనిని భావించవచ్చు. పద్య రచనలోనే గాక వచన రచనలోనూ తనదైన అద్భుత ప్రతిభను చూపినవాడు భైరవ మహాకవి. ‘శ్రీరంగ మహత్త్వము’లోని సుదీర్ఘ వచనాలే దీనికి ప్రమాణాలు. పోతన మహాకవి కూడా ‘భాగవతం’లో సుదీర్ఘ వచన రచన చేసిన విషయం తెలిసిందే. ఈ రకంగానూ ఆయనపై పోతన ప్రభావం చూపి ఉండవచ్చు. తెలుగు సాహితీ లోకాన తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న భైరవ మహాకవి కేవలం గౌరన పుత్రుడుగానేకాక ఆయనంతటి స్థాయికి చేరిన వారసుడుగానూ సాహితీ లోకం నిస్సందేహంగా భావించవచ్చు.

అయిదు ఆశ్వాసాలుగా ‘శ్రీరంగ మహత్తం’

‘శ్రీరంగ మహత్తము’ కావ్యం అయిదు ఆశ్వాసాలతో 1306 గద్య పద్యాలను కలిగి ఉంది. 

‘చెప్పెద కావ్యము రసములు

చిప్పిల, వర్ణనల నింపు చిలుకగ బాకం

బుప్పతిల జిత్ర రచనల

చొప్పడ శబ్దార్థ ఘటన సుకవులు మెచ్చన్’

అన్న పద్యం గమనిస్తే, భైరవుని ప్రతిభ, కావ్య నిర్మాణంలో ఆయన చూపిన రచనా పటుత్వం ప్రస్ఫుటమవుతాయి. ప్రతి కవి తన కావ్యాలను ఈ రీతిలో రచించే ప్రయత్నం చెయ్యాలన్న సందేశమే ఇది. కథాకథన చాతుర్యంలోను, రసపోషణలోను, కవి సమయ ప్రయోగాలలోను భైరవుని పరిణత ప్రతిభకు ఎన్నో తార్కాణాలు ఈ కావ్యంలో దర్శించగలం. ‘భగవద్గీత’లోని ‘సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ’ అన్న శ్లోక భావం ఈ కావ్యంలోని ‘ధర్మములు సకలకర్మ ఫలంబులు, పరిహరించి శరణుజొరుము నన్ను..’ అన్న పద్యంలో కనిపిస్తుంది. అనేక సంస్కృత కావ్యాల్లోని విశిష్ట భావాల ఛాయలనూ ఇందులో చూస్తాం. ఇది భైరవ మహాకవి వ్యుత్పత్తి ఎంతటిదో వెల్లడిస్తుంది.

గన్నమరాజు గిరిజా మనోహరబాబు

9949013448