బీఆర్‌ఎస్‌ను బొందపెడదాం

01-05-2024 01:03:57 AM

కూసుమంచిలో మంత్రి పొంగులేటి  

రుణమాఫీ చేసి తీరుతాం: డిప్యూటీ సీఎం భట్టి

పాలేరు, ఏప్రిల్ 30 (విజయక్రాంతి) : గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టిన బుద్ధి రాలేదని, జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ రాజకీయంగా బొందపెట్టాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో నిర్వహించిన కార్నర్  మీటింగ్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, ఖమ్మం ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరితో కలిసి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే సాధ్యమై నంత వరకు హామీలన్నీ అమలు చేశామని తెలిపారు.

రాబోయే కొద్ది రోజుల్లోనే రుణమాఫీ అమలు చేస్తామని,  ఆరోగ్యశ్రీ పరిమి తిని రూ.10 లక్షలకు పెంచామని స్పష్టంచేశారు. గత ప్రభుత్వంలో విద్యార్థులకు మెస్ బిల్లులు కూడా చెల్లించలేదని  రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే వాటిని చెల్లించామని చెప్పారు. కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని.. కరెంటు కోతలు లేకున్నా..  కరెంటు పోతుంది అంటూ మాట్లాడి ప్రజల్లో చులకన అవుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ చెప్పిన ఏ ఒక్క పథకం అమలు కాలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల్లోనే 5 గ్యారంటీలు అమలు చేశామని, మిగతా హామీలన్నీ కచ్చితంగా అమలు చేస్తామని, పార్లమెంట్ ఎన్నికల్లో రఘురాం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి, తెల్లరేషన్ కార్డు, పింఛన్లు, ఇండ్ల స్థలం లేని వారికి స్థలం, ఇల్లు, అదేవిధంగా సొంత జాగా ఉన్నవారికి రూ.5 లక్ష లు అందిస్తామని పునరుద్ఘాటించారు. త్వర లో రుణమాఫీ చేస్తామని తెలిపారు. అనంతరం ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలిపించాలని తాను నిత్యం ఖమ్మం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని ఖమ్మం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్‌ల  నియంత పాలనను ప్రజలు తరిమి కొట్టారని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు. సమావేశంలో కాంగ్రెస్ ఖమ్మం అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర గిడ్డంగులశాఖ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.

నామా కేంద్ర మంత్రి ఎలా అవుతాడో? 

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే: మంత్రి పొంగులేటి

ఖమ్మం , ఏప్రిల్ 30 (విజయక్రాంతి):  ఖమ్మం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలిస్తే కేంద్రంలో మంత్రి అవుతాడని ఖమ్మం పర్యటనలో కేసీఆర్ ప్రకటించారని, నామా నాగేశ్వరరావుకు  కేంద్ర మంత్రివర్గంలో చోటెలా దక్కుతుందో  కేసీఆర్ వివరించాలని మంత్రులు భట్టి విక్రమార్క , పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు.  బీజేపీకి బీఆర్‌ఎస్ బీ టీం అనేందుకు కేసీఆర్ వ్యాఖ్యలు నిదర్శనమని చెప్పారు. మంగళవారం ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరులో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ సమావేశంలో మంత్రులు మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు.

రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే లక్ష్యంతో  రామ సహాయం రఘురాంరెడ్డికి భారీ మెజారిటీ అందించాలని కోరారు.   కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమినేని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారన్నారు. కాంగ్రెస్ మండలాధ్యక్షులు సూరంశెట్టి కిషోర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు రాయల నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు ఐలూరి వెంకటేశ్వర రెడ్డి, మద్దినేనీ స్వర్ణకుమారీ, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, కోటా రాంబాబు,  ఎంపీపీ మెండెం లలిత తదితరులు పాల్గొన్నారు.