ప్రజాస్వామ్య శక్తులు ఒక్కటవ్వాలి

01-05-2024 01:01:54 AM

సంపదను పేదలకు పంచడమే కాంగ్రెస్, సీపీఎం ధ్యేయం

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క

ఖమ్మంలో సీపీఎం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశం

బీజేపీ పాలనలో ప్రజల ఐక్యతకు విఘాతం: తమ్మినేని

ఖమ్మం, ఏప్రిల్ 30 (విజయక్రాంతి):  దేశ రక్షణ కోసం ప్రజాస్వామిక శక్తులనీ ఏకం కావాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క  అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహా యం రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి మంగళవారం ఖమ్మంలోని ఎస్‌ఆర్ గార్డెన్‌లో సీపీఎం పార్లమెంట్ నియోజకవర్గస్థా యి విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్ఠానం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు తాను స్వయంగా సీపీఎం రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి ఆ పార్టీ మద్దతు కోరానన్నారు. దేశ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ప్రజాస్వామిక శక్తులన్నీ సంఘటితంగా ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు.

సంపదను పేద ప్రజలకు పంచడమే కాంగ్రెస్, కమ్యూనిస్టుల ధ్యేయమన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను కొద్దిమంది పెట్టుబడిదారుల చేతుల్లో పెడుతున్నదని మండిపడ్డారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. దేశ ప్రజల ఐక్యతకు బీజేపీ విఘాతం కలిగిస్తున్నదన్నారు. బీజేపీ వెనుక ప్రజల మధ్య విద్వేషాలను రగిల్చే ఓ ఫాసిస్టు సిద్ధాంతం ఉందన్నారు. రాజ్యాంగం స్థానంలో మనుధర్మాన్ని బీజేపీ ముందుకు తీసుకొస్తోందన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అడ్డుతొలగించుకుంటే మనుధర్మాన్ని స్వేచ్ఛగా అమలు చేయాలనేదే బీజేపీ వ్యూహమన్నారు. ఆ కుట్రలను తిప్పికొట్టేందుకే కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఒకే వేదికపైకి వచ్చి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయని స్పష్టం చేశారు.

కూటమి ప్రధాన లక్ష్యం బీజేపీని గద్దె దించడమేనని తేల్చిచెప్పారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, అన్నవరపు కనకయ్య, నాయకులు కాసాని ఐలయ్య, ఎం.సుబ్బారావు, యర్రా శ్రీకాంత్, పొన్నం వెంకటేశ్వర్లు, మాచర్ల భారతి, భూక్యా వీరభద్రం, బుగ్గవీటి సరళ, బంతు రాంబాబు, కళ్యాణం వెంకటేశ్వర్లు, వై.విక్రమ్, ఏజే రమేశ్, మచ్చా వెంకటేశ్వర్లు, కారం పుల్లయ్య, కె.పుల్లయ్య, బ్రహ్మచారి, కాంగ్రెస్ నాయకులు బాలసాని లక్ష్మీనారాయణ, రాయల వెంకటేశ్వర్లు, మద్దినేని బేబిస్వర్ణకుమారి, మిక్కిలినేని నరేంద్ర పాల్గొన్నారు.

సీపీఐ సహకారం మర్చిపోలేను: పొంగులేటి

సీపీఎం సహకారంతోనే తాను 2014 సార్వత్రిక ఎన్నికల్లో తాను ఎంపీనయ్యానని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆ పార్టీ సహకారాన్ని తాను ఎప్పటికీ మర్చిపోనన్నారు. తనకు మద్దతు నిలిచినట్లుగానే ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డికీ ఇవ్వాలని కోరారు. దేశంలో  ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాక కమ్యూనిస్టులు కోరుకున్న పాలన తీసుకువస్తామన్నారు. రాముడి అక్షింతల పేరుతో మాయ మాటలు చెప్పి బీజేపీ ఓట్లు దండుకోవాలని చూస్తున్నదన్నారు. ఈసారి కేంద్రంలో ఎన్డీఏ కూటమిని ఇంటికి పంపి, నూటికి నూరుశాతం ‘ఇండియా కూటమి’ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు