6 April, 2026 | 3:43 AM

జీవితం నా తప్పుల్నే లెక్క పెడుతుంది!

06-04-2026 02:06 AM

మనుషులను ప్రేమించీ

మాటలను గౌరవించీ 

హుషారుతనం నేర్చుకోలేదు

మంచితనంతో 

మర్యాదతో 

ఎవర్నీ కోపగించడం నేర్చుకోలేదు

కా వలసింది అడగలేక 

చేసింది చెప్పుకోలేక 

ఎలా బతకాలో నేర్చుకోలేదు 

ఎవర్నీ పొగడడం రాక 

ఎక్కడా పోట్లాడడం తెలియక 

వాదించడం నేర్చుకోలేదు 

ఎవరు ఎగతాళి చేసినా నవ్వాను 

ఎక్కడ ఆటపట్టించినా నవ్వాను 

ఎవరి ముందు ఎలా నవ్వినా, 

నా మనసు కుట్లు కనపడకుండా నవ్వాను


నా బలహీనతే నన్ను ఆగం చేసింది 

అన్నీ మరిచిపోయి అందర్నీ ప్రేమించాను 

సమయంతో పాటు అన్నీ గడిచి పోతాయు

వయసుతో పాటు అన్నీ జ్ఞాపకం వుంటాయి 

బాధ, ఎంతకూ గొంతులోనుంచి కిందికి దిగదు


ఈ జీవితం నా తప్పులే లెక్కపెడుతుంది 

నా త్యాగాలను నిర్దయగా పక్కన పడేస్తుంది 

ఊపిరి సలుపకుండా ఎన్నో ప్రశ్నలు వేస్తుంది 

ఒక్కసారి కూడా, నా జవాబులు వినదు 

మరచిపోయిన సామానులా 

జీవితం నన్ను వదిలి వెళుతుంటుంది 

నా వేలు పట్టుకొని నడిచే దాకా 

నేను వెనక వెనక పరుగెడుతున్నాను !

ఆశారాజు