18 June, 2026 | 8:20 AM

భార్య హత్య కేసులో యావజ్జీవ శిక్ష సబబే !

17-08-2024 02:26 AM

కింది కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు

హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): భార్య మంటల్లో కాలుతుండగా భర్త నిద్రపోతున్నాడన్న వాదన నమ్మశక్యంగా లేదని, పెళ్లయిన ఐదు నెలలకే భర్తకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి కేసులో ఇరికించాలనుకోవడానికి ఎలాంటి కారణం లేదంటూ భార్య హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష సబబేనంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. భార్య హత్య కేసులో కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను సవాలు చేస్తూ రంగారెడ్డి జిల్లా అన్నారంకి చెందిన భాస్కర్ అలియాస్ పుండరీకాక్షయ్య అప్పీలుచేశారు. దీనిపై జస్టిస్ సురేందర్, జస్టిస్ శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

అదనపు పీపీ జితేందర్రావు వాదనలు వినిపిస్తూ.. 2012 ఏప్రిల్ 25న భాస్కర్‌కు వివాహం కాగా అత్తవారింట్లోనే ఉండేవాడన్నారు. జూలై 15న పీడకలలు వస్తున్నాయని తల్లి దగ్గరకు వెళతానని భార్య కోరగా, భర్త అందుకు తిడుతూ ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడన్నారు. ఆమె చికిత్స పొందుతూ మృతిచెందిందన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ మృతురాలి తల్లి నిందితుడికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వలేదని, పథకం ప్రకారం హత్య చేశాడని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందన్నారు. ఆధారాలను పరిశీలించిన ధర్మాసనం బాధితురాలి నుంచి మేజిస్ట్రేట్ వాంగ్మూలం తీసుకునేముందు ఆమె మానసిక పరిస్థితి బాగానే ఉందని డాక్టరు ధ్రువీకరించారని పేర్కొన్నది.

మరణ వాంగ్మూలం ఆధారంగా శిక్ష విధించవచ్చని సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పులను ప్రస్తావించింది. తల్లి సాక్ష్యం ఇవ్వడంలో మాట మార్చినప్పటికీ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పలేదని, తమ కుమార్తె చావుకు మంటలు కారణమని చెప్పలేదన్నది. మరణ వాంగ్మూలంతోపాటు పరిస్థితులను పరిశీలించిన మీదట భర్తకు యావజ్జీవ శిక్ష విధిస్తూ కింది కోర్టు వెలువరించిన తీర్పులో జోక్యం చేసుకోలేమంటూ అప్పీలును కొట్టివేసింది.