18 June, 2026 | 9:23 AM

సిగ్గు పడేలా సీఎం రేవంత్‌రెడ్డి తీరు

17-08-2024 02:21 AM

ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు

హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడి ఖమ్మం సభలో మాట్లాడిన తీరు తెలంగాణ సమాజం సిగ్గు పడేలా ఉందని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మండిపడ్డారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా హాల్‌లో మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా గత పాలకులపై ఇష్టానుసారంగా విమర్శలు చేశార న్నారు.  అక్కడ రైతులను ఉద్దేశించి మాట్లాడాలని కానీ కేసీఆర్, హరీశ్ రావులను ఉద్దేశించి అడ్డగోలు మాట్లాడారని విమర్శించారు. ఇచ్చిన హామీలు, రెండు లక్షల ఉద్యోగాలు, రెండు లక్షల రుణం మాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీశ్ రావు సవాల్ విసిరారని ఆయన పేర్కొన్నారు.

ఇందులో ఒక్కదాన్ని కూడా అమలు చేయకపోగా  నోటికి వచ్చినట్లు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.  ఎమ్మెల్సీ తాతా మధు సూదన్ ప్రసంగిస్తూ గతంలో హరీశ్ రావు  లేఖలో పేర్కొన్న ఏ ఒక అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయలేదని మండిపడ్డారు. హామీలు అమలు చేయకుండా రాజీనామా అడిగే హక్కు రేవంత్‌రెడ్డికి ఎక్కడిదని ప్రశ్నించారు.

కేసీఆర్ లక్షలోపు రుణాలు మాఫీ చేసేందుకు రూ. 17వేల కోట్లు కేటాయించారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి రూ. 17వేలు కోటుతో రూ.  2 లక్షల లోపు రుణ మాఫీ ఏవిధంగా సాధ్యమైతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు గ్రామాలకు వెళితే రైతుల్లో ఎంత ఆగ్రహం ఉందో బయటపడుతుందన్నారు. ఎడ్మ బొజ్జు, మందుల సామేల్  ను గెలిపించుకున్న విషయం చెప్పడానికి విదేశాలకు వెళ్లారా అంటూ నిలదీశారు. 

గన్‌పార్కు వద్ద బీఆర్‌ఎస్వీ ఆందోళన 

రైతుమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి తీరును నిరసిస్తూ బీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. రైతు రుణమాఫీ నుంచి తప్పించుకునేందుకు హరీశ్‌రావు రాజీనామా చేయా లని డ్రామాలు మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్  రాజీనామా చేయాలని అడిగే హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు.  సగం మంది రైతులకు కూడా రుణమాఫీ జరగలేదని విమర్శించారు.