23 May, 2026 | 9:47 PM

ఆర్టీసీ బేబీకి లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్

21-08-2024 06:27 AM
  1. కండక్టర్, నర్సుకు ఏడాదిపాటు.. 
  2. సిబ్బంది గర్వించేలా పని చేస్తున్నరు 
  3. అభినందించిన ఎండీ వీసీ సజ్జనార్

హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): బస్సులో జన్మించిన చిన్నారికి జీవిత కాలంపాటు రాష్ర్టవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్ పాసును అందిస్తున్నట్లు ఆర్టీసీఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.  రాఖీ పౌర్ణమి నాడు గద్వాల డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో ఇబ్బందులు పడుతున్న గర్భిణికి ప్రసవం చేసిన సిబ్బందిని మంగళవారం బస్ భవన్‌లో  ఆయన అభినందించారు.

ఈ సందర్భంగా  గర్బిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న కండక్టర్ భారతి, డ్రైవర్ అంజి,  వనపర్తి ఎంసీహెచ్ స్టాఫ్ నర్స్  స్టాఫ్ నర్స్ అలివేలు మంగమ్మను సన్మానించి నగదు బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్‌లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్ పాస్‌ను ఇవ్వాలని యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు.. గద్వాల బస్సులో పుట్టిన పాపకు బర్త్ డే గిప్ట్‌గా లైఫ్ టైం ఫ్రీ బస్ పాసును మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

కండక్టర్‌తో పాటు నర్సు మంగమ్మకు డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లోనూ ఏడాది పాటు ఉచితంగా ప్రయా ణించే బస్ పాసును ఎండీ అందిచారు. అనంతరం  చిన్నారి ఉచిత బస్ పాస్‌ను గద్వాల డిపో మేనేజర్ మురళీకృష్ణకు అందజేశారు.ప్రయాణికులను క్షేమంగా గమ్య స్థానాలకు చేర్చడమే కాకుండా  ఆర్టీసీ కార్మికులు సేవాతత్పరతలోనూ ముందుండి గర్వించేలా పని చేస్తున్నారని  సజ్జనార్ అన్నారు. కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీదేవి, డిప్యూటీ సీటీఎం జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.