2 July, 2026 | 1:14 AM

బాబ్లీ ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత

02-07-2026 12:00 AM
  1. నీటిని విడుదల చేసిన కేంద్ర జల సంఘం అధికారులు
  2. శ్రీరామసాగర్ ప్రాజెక్టులోకి చేరుకోనున్న నీరు

నిర్మల్, జులై 1 ( విజయ క్రాంతి): తెలంగాణ సరిహద్దు , శ్రీరామసాగర్ ప్రాజెక్టు పరీవాహక ప్రాంతమైన మహారాష్ట్ర ధర్మాబాద్ తాలూకాలోని బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను బుధవారం అధికారులు ఎత్తివేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జులై 1 నుంచి అక్టోబర్ 28 వరకు నాలుగు నెలల పాటు నీటిని విడుదల చేయవలసి ఉంటుంది.

కేంద్ర జల వనరుల సంఘం అధికారులు చరణ్ అతుల్ సాయి ప్రవీణ్ శ్యాము ప్రకాష్ బత్తిని, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖ అధికారులు సీఆర్ బన్సోడ్ సీడీ పతిధార్ డి గవానే, తెలంగాణ లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోత రవి శ్యాం నాయక్ వినయ్ రెడ్డి సమక్షంలో ఈ గేట్లను ఎత్తారు. అందులో భాగంగానే మూడు రాష్ట్రాల అధికారులు, సెంట్రల్ వాటర్ కమిషన్ సమక్షంలో గేట్లను ఎత్తి దిగువకు గోదావరి నీటిని వదిలారు.

దీంతో బాబ్లీ వద్ద నిల్వ ఉన్న 0.2 టీఎంసీ నీరు శ్రీరాంసాగర్ లోకి చేరుకోనుంది. అక్టోబర్ 28 వరకు బాబ్లీ గేట్లు తెరిచి ఉండడంతో మహారాష్ట్ర పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు వరద నీరు శ్రీరాంసాగర్‌లోకి పూర్తిస్థాయిలో రానుంది. ప్రస్తుతం మహారాష్ట్రలో వర్షాలు లేనందున గోదావరిలో నీటి ప్రవాహం తక్కువ స్థాయిలో ఉన్నట్టు అధికారులు తెలిపారు.