2 July, 2026 | 1:10 AM

ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలి

02-07-2026 12:00 AM
  1. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
  2. లక్ష మందితో సచివాలయం ముట్టడిస్తాం
  3. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ హెచ్చరిక 

ముషీరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో బుధవారం సాయంత్రం తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, అదనపు ఆఫీసులో ఏర్పడిన తర్వాత అదనపు పోస్టులు సృష్టించడం, భర్తీ చేయడం లేదన్నారు. ప్రమోషన్ల ద్వారా రిటర్మెంట్ వల్ల ఏర్పడ్డ పోస్ట్ లు భర్తీ చేయలేదన్నారు. పోలీస్ శాఖలో దాదాపు 18 వేల కానిస్టేబుల్, ఎస్సు పోస్టులు ఖాళీగా ఉన్నా నోటిఫికేషన్ జారీ చేయడం లేదన్నారు. 30 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయవలసి ఉందన్నారు. 14 యూనివర్సిటీలలో టీచర్ పోస్టులు 2,800 ఖాళీగా ఉన్నాయని, ప్రొఫెసర్ పోస్టులు లెక్చరర్ పోస్టులు 80 శాతం ఖాళీగా ఉన్నాయన్నారు.

ఈ పోస్టులను భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరారు. 20 వేల గ్రూప్ స్థాయి పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని తెలిపారు. చిక్కడపల్లి లైబ్రరీ నిరుద్యోగ జేఏసీ నాయకులు శంకర్ నాయక్, నరేష్, రవి నాయక్, రవి యాదవ్, కుమార్, పలువురు జేఏసీ నాయకులు మాట్లాడుతూ..  నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత ఆత్మ బలిదానాలకు ముగింపు పలికేలా వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. లేదంటే లక్ష మందితో సచివాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.