21-01-2026 12:33:57 AM
తరుణ్ భాస్కర్ లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఈషా రెబ్బా హీరోయిన్. ఈ చిత్రంతో ఏఆర్ సజీవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సృజన్ యర బోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు నిర్మాతలు. జనవరి 30న రిలీజ్ కానున్న ఈ సినిమా విశేషాలను డైరెక్టర్ సజీవ్ విలేకరులతో పంచుకున్నారు. “35 చిన్న కథ కాదు’ సినిమాకు డైరెక్టర్ నంద కిశోర్‌తో కలిసి పనిచేశాను. అప్పుడే ఈ ప్రాజెక్టు గురించి చెప్పారు. ఇది రీమేక్. మూల కథలోని కోర్ పాయింట్ తీసుకున్నా. 60% కథని మార్చాం.
కల్చర్ చాలా డిఫరెన్స్. బ్యాక్‌డ్రాప్‌ని గోదారి ప్రాంతానికి మార్చాం. చివరి 30 నిమిషాలు కొత్త కథలాగే అనిపిస్తుంది. ఈవీవీ సినిమాల్లోలాగా భార్యాభర్తల మధ్య వినోదం, భావోద్వేగాలు ఈ సినిమాలో చక్కగా కుదిరాయి. తరుణ్ పూర్తిగా గోదావరి యాసలో మాట్లాడారు. ఆయన పాత్ర చేపల వ్యాపారం చేసే వ్యక్తి. ఒక చేప జీవితాన్ని మెటఫర్‌గా తీసుకుని ఆ క్యారెక్టర్‌ని డిజైన్ చేశాం. చేపకి మనం ఫుడ్ వేసినప్పుడు అది పొడుచుకునే తింటుంది. తరుణ్ క్యారెక్టర్ ఆ ఊర్లో తన తండ్రి మామయ్యను చూస్తూ పెరిగిన క్యారె క్టర్. ఆ ఊరు తప్పితే మరో ప్రపంచం తెలియదు.
శాంతి పాత్రను క్యాషియో (జీడి)ని మెటాఫర్‌గా తీసుకున్నాం. మనం క్యాషియో నట్ తీసుకొని ఆ పండు పారేస్తాం. నిజానికి అది ఆరోగ్యానికి చాలా మంచిది. అమ్మాయి ప్రాముఖ్యతను తెలిజేసేలా ఆ పాత్రను డిజైన్ చేశాం. ఒరిజినల్ లో దర్శన కంటే ఈషా పాత్ర చాలా ప్రభావవంతంగా ఉంటుంది. డ్రామా, ఎమోషన్స్ విషయంలో దర్శకుడిగా నాకు మంచి పేరు వస్తుందని నమ్ముతున్నా. భవిష్యత్తు ప్రాజెక్టుల కోసం కొన్ని కథలు సిద్ధంగా ఉన్నాయి. నాకు మంచి డ్రామా ఉన్న కథలు చేయడం ఇష్టం” అని తెలిపారు.