21-01-2026 12:35:52 AM
రాష్ట్రంలో సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారంపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టికెట్ రేట్లు పెంచవద్దంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం బేఖాతరు చేస్తూ వరుసగా అనుమతులు ఇవ్వడం ఏంటని న్యాయస్థానం మండిపడింది. మీకు ఎన్నిసార్లు చెప్పాలి.. అంటూ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ సీవీ ఆనంద్‌కు కోర్టు ధిక్కరణ కంటెంప్ట్ నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. టికెట్ రేట్ల విషయంలో మరో కీలక నిబంధనను తెరపైకి తెచ్చింది.
ఇకపై ఏ సినిమాకైనా టికెట్ రేట్లు పెంచాలని భావిస్తే.. సినిమా విడుదలకు 90 రోజుల ముందే ఆ నిర్ణయం తీసుకోవాలని, చివరి నిమిషంలో హడావుడిగా పెంపు నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వానికి, చిత్ర పరిశ్రమకు సూచించింది. గతంలో ‘పుష్ప-2’ విడుదల సమయంలో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. ఇకపై ఏ సినిమాకూ టికెట్ ధరలు పెంచొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ ఆదేశాలను తోసిరాజని సంక్రాంతి సందర్భంగా ప్రభాస్ ‘రాజాసాబ్’, చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాలకు టికెట్ రేట్లు పెంచుకునేలా సర్కారు మెమో జారీ చేసింది. దీన్ని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కోర్టుకు కనీస సమాచారం ఇవ్వకుండా, పాత ఆదేశాలను ఉల్లంఘిస్తూ జీవోలు ఇవ్వడంపై ధర్మాసనం సీరియస్ అయింది.