మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు తీసుకొస్తున్నాం
- 'స్టాండ్ విత్ హర్' కార్యక్రమంలో సీఎం రేవంత్.
- మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం.
- మహిళల రక్షణ ఇంకా పెంచాలి.
- మహిళల పేరుమీదే.
హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(International Women's Day) జరుపుకోవడం మాత్రమే సరిపోదని, సమాజంలో మహిళల భద్రత, గౌరవం, సాధికారతను నిర్ధారించడానికి సమిష్టి బాధ్యత అవసరాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వివరించారు. జేఎన్టీయూ ఆడిటోరియంలో 'స్టాండ్ విత్ హర్'(Stand With Her) కార్యక్రమంలో పాల్గొన్న సీఎం పోస్టర్ లాంచ్ చేశారు. మహిళల ప్రాధాన్యం గురించి కాంగ్రెస్ లో పదవులు ఇస్తున్నామని సీఎం వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. చట్టాలు చేసినంత మాత్రాన ప్రభుత్వాల బాధ్యత తీరదు, చట్టాల అమలు దిశగా చర్యలు చేపట్టాలన్నారు.
మహిళల రక్షణ కోసం అనే చట్టాలు తీసుకొస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పిన సీఎం రేవంత్ ప్రభుత్వానికి మహిళలపై సంపూర్ణమైన విశ్వాసం ఉందని పేర్కొన్నారు. అభివృద్ధిలో తెలంగాణ దూసుకెళ్లోందని రేవంత్ రెడ్డి సూచించారు. మహిళల పేరు మీదే పథకాలు అందిస్తున్నామని తెలిపారు. హైటెక్ సిటీ పక్కన ఇందిరా మహిళ స్టాల్స్ కోసం స్థలం, అమెజాన్ ద్వారా గ్రామీణ మహిళల ఉత్పత్తులు అమ్మే వెసులుబాటు కల్పిస్తామన్నారు. మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీలో 1000 బస్సులు నడిపిస్తున్నామని వెల్లడించారు. తమ ప్రభుత్వంలో వివిధ విభాగాధిపతులుగా మహిళలకు అవకాశం కల్పించామన్నారు. మహిళల రక్షణ ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మహిళల రక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కోరారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే కుటుంబం, రాష్ట్రం, దేశం బలపడుతుందని తెలిపారు. మహిళల పై మార్ఫింగ్, నకిలీ వీడియోలు, సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు.
మహిళలకు అండగా ఉందాం: సాయి ధరమ్ తేజ్
తెలంగాణ మహిళ భద్రత విభాగం అవగాహన కార్యక్రమంలో టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ పాల్గొన్నారు. ప్రతి ఆడపిల్లలకు తల్లికి ఇచ్చే గౌరవాన్ని ఇవ్వాలని పిలుపునిచ్చారు. మహిళలకు అండగా ఉందామని సాయి ధరమ్ తేజ్ పేర్కొన్నారు.




